కచ్చితంగా అది భూ దురాక్రమణే!

19 Aug, 2016 03:34 IST|Sakshi
కచ్చితంగా అది భూ దురాక్రమణే!

పేరు ఏదైనా భూములను బలవంతంగా లాక్కుంటున్నారు
► సాక్షి టీవీ ఇంటర్వ్యూలో ప్రముఖ జర్నలిస్ట్ పి.సాయినాథ్
► ఆంధ్రప్రదేశ్‌లో దూకుడు ఎక్కువగా ఉంది
► అమరావతికి 33 వేల ఎకరాలా?
► 4 వేల ఎకరాలైతే అద్భుత రాజధాని నిర్మించవచ్చు
► పేదల నోళ్లు కొట్టి కార్పొరేట్లకు మేలు చేస్తున్నారు
► భవిష్యత్‌లో సామాజిక, ఆర్థిక, పర్యావరణ ముప్పు తప్పదు

 సాక్షి, హైదరాబాద్: ‘‘భూ సేకరణా లేక భూ సమీకరణా.. పేరు ఏదయినా నా దృష్టిలో అది కచ్చితంగా భూ దురాక్రమణే. సామాజిక ప్రభావం, పర్యావరణ ప్రభావ మదింపులు లేవు. బలవంతంగా భూముల్ని లాగేసుకుంటూ జనానికి భూమి దూరం చేస్తున్నారు. అది రెండు పంటలు పండే భూమా, లేక మూడు పంటలు పండేదా అనే దానితో సంబంధం లేకుండా మెడ మీద కత్తి పెట్టి భూమిని గుంజుకుంటున్నారు’’ అని ప్రముఖ పాత్రికేయులు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని గుంజుకోవడంలో ఆంధ్రప్రదేశ్ దూకుడు మరీ ఎక్కువగా ఉందన్నారు. మున్ముందు సామాజిక, ఆర్థిక, రాజకీయ, పర్యావరణ రంగాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో ఓ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సాయినాథ్‌ను ఫ్రీలాన్స్ జర్నలిస్టు సునీతారెడ్డి సాక్షి టీవీ కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. అందులోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

కౌలుదారులకు మేలు జరగడంలేదు
రైతులకు నిజంగా మేలు చేయాలనుకుంటే మూడు పనులు చేయాలి. వ్యవసాయ సంక్షోభాన్ని సమగ్రంగా చర్చించేందుకు పార్లమెంటును ప్రత్యేకంగా పది రోజులు సమావేశపర్చాలి. రెండోది స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని చర్చించడం, మూడోది వ్యవసాయాన్ని ప్రజా సేవా రంగంగా గుర్తించడం. ఇది చేస్తే రైతుకు కనీస ఆదాయం వస్తుంది. భూ రికార్డులతో సంబంధంలేకుండా కౌలు దారులకు రుణం ఇప్పించే ఉద్దేశంతో 2011లో ఓ చట్టం వచ్చినప్పటికీ వారికి మేలు జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది కౌలు దార్లు ఉంటే కేవలం ఐదు శాతం మందికే కార్డులు వచ్చాయి. ఏపీ, తెలంగాణలో ఈ కార్డులు చాలా అవసరం. పంటల బీమా రంగంలో ఎల్‌ఐసీ, జీఐసీ కంటే ప్రైవేటు సంస్థలే ఎక్కువ పాత్ర పోషిస్తున్నాయి. ప్రైవేటు రంగం పెరిగితే దోపిడీ మరింత పెరుగుతుంది. ఏపీలో పంట రుణాలను చాలా తక్కువ మందికే ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతుల బీమా సొమ్ము సుమారు రూ.

వేయి కోట్లు ఎల్‌ఐసీ వద్ద ఉంది. మూడు వాయిదాల ప్రీమియం చెల్లించిన తర్వాత క్లెయిమ్ మొత్తాన్ని ఇవ్వాలి. అలా చేయడానికి బదులు వారి ఖాతాలనే మూసివేసింది ఎల్‌ఐసీ. వాటిని పునరుద్ధరించి వాళ్ల డబ్బు వాళ్లకు చెల్లించమని పార్లమెంటుకూ విజ్ఞప్తి చేశా. ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇక మా వెబ్‌సైట్.. ‘రూరల్‌ఇండియాఆన్‌లైన్.ఆర్గ్’ లో గ్రామీణ భారతాన్ని రికార్డు చేస్తున్నాం. కమ్మరి, కుమ్మరి, జాలరి, మగ్గం మొదలు.. రైతు ఆత్మహత్యలు, వ్యవసాయదారుల ముఖకవళికల వరకు అన్నింటినీ రికార్డు చేస్తాం. తెలుగులో ఎవరైనా స్వచ్ఛందంగా అనువాదం చేసి మా వెబ్‌సైట్లో పెట్టాలని కూడా కోరుకుంటున్నా.
 
రాజధాని కోసం 33 వేల ఎకరాలా?
అమరావతికి 33 వేల ఎకరాలా! ఈ అంశం నన్ను విస్మయ పరుస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌ను కేవలం 2 వేల ఎకరాల్లో కడుతున్నారు. 15 వందల నుంచి 4 వేల ఎకరాలయితే అద్భుత రాజధానిని నిర్మించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అటువంటప్పుడు 33 వేల ఎకరాలు ఎందుకో అర్థం కావడంలేదు. రైతుల దగ్గర లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కాకపోతే ఇంత భూమి ఎందుకు? ప్రస్తుతం జరుగుతున్న తంతు ఇదే. మున్ముందు దీని వల్ల అనేక సమస్యలు రానున్నాయి. దురదృష్టమేమిటంటే మీడియాలోనూ స్వప్రయోజనాలుండడంతో గ్రామీణ భారతం వార్తలు రావడం లేదు. ఈ సందర్భంలో నేనో ఉదాహరణ చెబుతా.. విదర్భలో 43 మందికి పవర్ ప్లాంట్స్ ఇస్తే వాటిల్లో మీడియా సంస్థలకు ఐదు ఇచ్చారు. వాళ్లింకేం వార్తలు రాస్తారు.

>
మరిన్ని వార్తలు