హోరెత్తిన భద్రాద్రి

17 Nov, 2013 05:05 IST|Sakshi

భద్రాచలం, న్యూస్‌లైన్:  భద్రాచలం డివిజన్‌ను తెలంగాణాలోనే ఉంచాలంటూ జర్నలిస్టులు చేపట్టిన బంద్ రెండోరోజైన శనివారం కూడా సంపూర్ణంగా జరిగింది. దీంతో జనజీవనం స్తంభించింది. బంద్ విజయవంతానికి జర్నలిస్టు సంఘాలు, టీజేఏసీ నాయకులు ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా బస్టాండ్ ఎదుట బైఠాయించారు. బ్రిడ్జి సెంటర్‌లో టైర్లను కాల్చి నిరసన తెలిపారు. బంద్‌తో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు సారపాక వరకే తిరిగాయి. దీంతో రామాలయానికి వచ్చే భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మూడు కిలోమీటర్లు కాలినడకనే రావాల్సి వచ్చింది. డివిజన్‌లోని అన్ని మండలాల్లోనూ ర్యాలీలు, రాస్తారొకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కూనవరం మండలం మర్రిగూడెంలో రహదారిపైనే తెలంగాణ వాదులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.
 వైద్యుల టీజేఏసీ సంఘీభావ ర్యాలీ...
 భద్రాచలంను తెలంగాణాలోనే ఉంచాలంటూ చేస్తున్న బంద్‌కు మద్దతుగా పట్టణ వైద్యుల జేఏసీ ఆధ్వర్యంలో కొమ్మునృత్యాలు, ఆదివాసీ గిరిజన సంప్రదాయ నృత్యాలతో అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే రాస్తారొకో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుల కన్వీనర్ కాంతారావు మాట్లాడుతూ...భద్రాచలంను పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణాలోనే ఉంచాలని, ప్రత్యేక జిల్లాగా మార్చాలని డిమాండ్ చేశారు.
 కొనసాగుతున్న దీక్షలు...
 భద్రాద్రి పరిరక్షణ కోసం టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు  ఏడవ రోజుకు చేరాయి. శనివారం నాటి దీక్షలలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఉద్యోగులు, అర్చకులు, గౌతమీ బ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు కూర్చున్నారు. ఈ దీక్షా శిబిరాన్ని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, ఎమ్మెల్సీ పూల రవీందర్, గెజిటెడ్ అధికారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ.. భద్రాచలంను తెలంగాణకు అప్పగించకపోతే, సీమాంధ్రులను హైదరాబాద్‌లో  అడుగుపెట్టనిచ్చేది లేదని హెచ్చరించారు. భద్రాచలంను తెలంగాణ నుంచి విడదీస్తే ఈ ప్రాంతం భగ్గుమంటుందన్నారు.
 పలు సంఘాల ర్యాలీలు..
 బంద్, దీక్షలకు మద్దతుగా పలు కుల, రాజకీయ, విద్యార్థి, కార్మిక, ఉద్యోగ, వర్తక సంఘాల ర్యాలీలతో భద్రాచలం హోరెత్తింది. తెలంగాణ నినాదాలతో వీధులు మార్మోగాయి. సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్, టీఆర్‌ఎల్‌డీ, టీడీపీ, బీజేపీతో పాటు వైద్యుల జేఏసీ, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, రైసుమిల్లుల అసోసియేషన్, సీఐటీయూ, నేషనల్ మజ్దూర్ యూనియన్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు వేర్వేరుగా ప్రదర్శనలు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులు అంబేద్కర్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు.
 జర్నలిస్టుల అరెస్టు...
 ఆర్టీసీ డిపో నుంచి శనివారం సాయంత్రం బయటకు వస్తున్న బస్సులను అడ్డుకున్న 17మంది జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిపై బైండోవర్ కేసు లు నమోదు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
 హోర్డింగ్ పెకైక్కిన యువకులు...
 భద్రాచలంను తెలంగాణాలోనే ఉంచాలంటూ మామిడి పుల్లారావు, అలవాల రాజా, తమ్మళ్ల రాజేష్, గోళ్ల మహేష్, ఎండి బషీర్ అనే యువకులు అంబేద్కర్ సెంటర్ వద్దనున్న బహుళ అంతస్థు భవనంపైనున్న హోర్డింగ్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పట్టణ ఎస్సై ఎం.అబ్బయ్య అక్కడికి చేరుకొని వారితో ఫోన్‌లో మాట్లాడారు. అయినా వారు ససేమిరా అంటూ రెండు గంటలపాటు నిరసన కొనసాగించారు. చివరకు జర్నలిస్టులు వారితో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత కిందకు దిగివచ్చారు.

టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలలో శనివారం అర్చకులు శ్రీనివాసాచార్యులు, వేణుగోపాలాచార్యులు, శ్రీధరాచార్యులు, కొవ్వూరి దిలీప్, రామావజ్జుల రవికుమార్, సౌమి త్రి శ్రీనివాసాచార్యుల, అమరవాది శేషగోపాలాచార్యులు, దేవస్థాన సిబ్బంది అన్నెం శ్రీనివాసరెడ్డి, పి.వెంకటప్పయ్య, కె.నిరంజన్‌కుమార్, ఎస్.ప్రభాకర్, రామిరెడ్డి, రాము, కిశోర్, రాము, కనకదుర్గా, స్వర్ణకుమారి, నాగమణి తదితరులు కూర్చున్నారు. వీరికి రామాలయ ప్రధాన అర్చకు లు పొడిచేటి జగన్నాధాచార్యులు, స్థానాచార్యు లు స్థలశాయి, టీజేఏసి నాయకులు చల్లగుళ్ల నాగేశ్వరరావు, ఎస్‌కే గౌసుద్దీన్, ఈశ్వర్, కె.సీతారాము లు, రేగలగడ్డ ముత్తయ్య, ఎంపీడీవో రమాదేవి, డిగ్రీ కళాశాల ప్రిన్స్‌పాల్ వి కృష్ణ, కెచ్చెల కల్పన, కుంజా ధర్మా, బొలిశెట్టి రంగారావు, బోగాల శ్రీనివాసరెడ్డి, తాండ్ర నర్సింహారావు, సోందే వీరయ్య తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు