జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఏపీ హైకోర్టుకు బదిలీ

18 Oct, 2019 05:10 IST|Sakshi

సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం

రాష్ట్రపతి ఆమోదముద్ర లభించాక అమలులోకి

సాక్షి, అమరావతి: పాట్నా హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ ఎన్‌.వి.రమణలతో కూడిన కొలీజియం ఈ నెల 15న సమావేశమై పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలపై చర్చించింది.

ఈ సందర్భంగా పాట్నా హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించి ఆ మేరకు తీర్మానం చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.  న్యాయవ్యవస్థలో అవినీతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసి జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఇటీవల వార్తల్లో నిలిచారు. పాట్నా సివిల్‌ కోర్టులో అవినీతి జరుగుతోందంటూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. కింది కోర్టుల్లో అవినీతి విషయంలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.  

ఇదీ నేపథ్యం
జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ 1959 జనవరి 1న జన్మించారు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1983లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. పాట్నా హైకోర్టులో క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులను వాదించారు. 26 ఏళ్ల పాటు ప్రాక్టీస్‌ సాగించారు. 12 ఏళ్ల పాటు సీబీఐకి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు. ప్రభుత్వ న్యాయవాదిగా, స్పెషల్‌ పీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2009 డిసెంబర్‌ 25న పాట్నా హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2011  అక్టోబర్‌ 24న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2020 డిసెంబర్‌ 31న ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

మరిన్ని వార్తలు