వివేకానందరెడ్డి మృతి.. డోర్‌ లాక్‌ ఎవరు తీశారు?

15 Mar, 2019 14:11 IST|Sakshi

సాక్షి, పులివెందుల : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అకాల మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. పులివెందుల్లోని వైఎస్‌ వివేకానంద రెడ్డి నివాసంలో క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. అసలేం జరిగింది? బెడ్‌ రూమ్‌లో ఏసీ ఉన్నప్పటికీ డోర్‌ ఎందుకు ఓపెన్‌ చేసి ఉంది? సైడ్‌ డోర్‌ లాక్‌ ఎవరు తీశారు? అనే కోణాల్లో విచారణ జరపుతూ వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఈ ఫిర్యాదుపై పులివెందుల సీఐ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ వివేకానంద రెడ్డి మృతిపై సెక్షన్‌ 171 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాత్రూమ్‌లో పడి ఉన్నారని, తలపై గాయాలున్నాయని, ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

చాలా సీరియస్‌గా తీసుకున్నాం : ఎస్పీ
వైఎస్‌ వివేకానంద రెడ్డి మృతిపై లోతుగా దర్యప్తు చేస్తున్నామని కడప జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, ఫోరెన్సిక్‌ నిపుణులను ప్రత్యేకంగా రప్పిస్తున్నామన్నారు. ఇప్పటికే ఘటనా స్థలాన్ని క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ క్షుణ్ణంగా పరిశీలించాయని తెలిపారు. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నామని, విచారణలో ఎవరి పాత్ర అయినా ఉన్నట్లు తేలితే చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు