‘కల్యాణలక్ష్మి’కి కష్టాలు

15 Feb, 2015 01:22 IST|Sakshi
‘కల్యాణలక్ష్మి’కి కష్టాలు
  • ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వధువులకు సరిగా అందని ఆర్థిక సాయం
  •  కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చిక్కులు
  •  ధ్రువపత్రాలు సంపాదించేందుకే నెలలకొద్దీ సమయం      
  • సాక్షి నెట్‌వర్క్: పేద కుటుంబాల యువతుల వివాహాల కోసం ఉపయోగపడాల్సిన  కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అడ్డగోలు నిబంధనల చట్రంలో చిక్కుకుపోయాయి. సవాలక్ష పత్రాలు సమర్పించాల్సి రావడం, తనిఖీ పేరిట జరుగుతున్న జాప్యంతో పథకాలు గందరగోళంగా మారాయి. దరఖాస్తులపై వెరిఫికేషన్‌ను పూర్తిచేసి, ఆర్థిక సాయాన్ని అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.

    దీంతోపాటు జనన ధ్రువీకరణ పత్రం నుంచి ఇదే మొదటి పెళ్లి అని నిర్ధారించేదాకా... కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాల నుంచి పెళ్లి కుమారుడి సర్టిఫికెట్ల దాకా 20 వరకు ధ్రువపత్రాలు సమర్పించాల్సి రావడం దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారింది. అసలు ఈ పథకాలపై అవగాహన లేకపోవడం, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి రావడం వంటివాటి కారణంగా అర్హులైన పేద కుటుంబాలకు లబ్ధి కలగడం లేదని ప్రభుత్వాధికారులే అంటుండడం గమనార్హం. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా కల్యాణ లక్ష్మి పథకానికి ఇప్పటివరకు 2,222 మంది దరఖాస్తు చేసుకుంటే... అందులో బ్యాంకు ఖాతాలో నగదు జమ అయింది మాత్రం 503 మందికే. షాదీ ముబారక్ పథకానికి 2,173 మంది దరఖాస్తు చేయగా... నిధులు జమ అయింది 1,045 మందికే.
     
    దరఖాస్తు తంటాలు:ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాల యువతుల వివాహాలకు రూ. 51 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకాల ఉద్దేశం బాగానే ఉన్నా... దరఖాస్తు చేసుకోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. లబ్ధిపొందే వధువు తెలంగాణ రాష్ట్ర నివాసితురాలిగా ఉండాలని, వధూవరుల నివాస, కుల, ఆదాయ, వయసు, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులతోపాటు ఇదే మొదటి వివాహమని రుజువు చేసే పత్రాలను, విద్యార్హత పత్రాలను సమర్పించాలి.

    వధూవరుల పెళ్లి తేదీ ఖరారును ధ్రువీకరిస్తూ వీఆర్‌వో లేదా పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. అయితే చాలామందికి దీనంతటిపై అవగాహన లేదు. అవగాహన ఉన్నవారికి ఈ పత్రాలన్నీ సమర్పించాల్సి రావడం కష్టతరమవుతోంది. ఈ పత్రాలన్నీ తెచ్చుకునేందుకే చాలా సమయం పడుతుండడంతో పాటు ఖర్చూ పెట్టాల్సి వస్తోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు.
     
    ఆచరణ ఏదీ..?


    ఈ పథకాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో జిల్లాకు రూ. 3 కోట్లను కేటాయించింది. కానీ రూ. 50 లక్షలైనా ఖర్చుచేయలేదని తెలుస్తోంది. నిబంధనలను సరళతరం చేస్తేనే లబ్ధిదారులకు త్వరగా సహాయం అందించగలమని అధికారులే చెబుతుండడం గమనార్హం. ఈ పథకాలకు ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను అధికారులు చెక్‌లిస్ట్‌తో జత చేసి తహసీల్దార్ కార్యాలయాలకు పంపాలి. వాటిని తహసీల్దార్లు పరిశీలించాలి. తర్వాత వధువు ఇంటికి వెళ్లి వీఆర్వో విచారించాలి. ఈ క్రమంలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది.
     
    మంత్రి చెప్పినా సరే..

    మంత్రి కేటీఆర్ ఇటీవల మహబూబ్‌నగర్‌లో పర్యటించిన సందర్భంగా... గ్రామీణ ప్రాంత ప్రజలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం కష్టమని, మాన్యువల్‌గా దరఖాస్తులు ఇచ్చినా తీసుకుని వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. కానీ అధికారులు అదేమీ పట్టించుకోవడం లేదు.
     
    చదువుకున్నా.. లేనట్లయింది


    నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం పేర్వాలకు చెందిన షేక్ సయ్యద్ కుమార్తె సమీనాబేగం వివాహం గత జనవరి నెలలో జరిగింది. 2008కి ముందు బీసీ ‘బీ’లో ఉన్నవారి కులాన్ని.. తర్వాత ప్రభుత్వం బీసీ ‘ఈ’ జాబితాలో చేర్చింది. కానీ అప్పటికే చదువుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్‌లో మాత్రం బీసీ ‘బీ’గా పేర్కొంటుండగా ప్రస్తుతం బీసీ ‘ఈ’ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే అధికారులు అంగీకరించడం లేదు. దీంతో పెద్ద తంటా వచ్చి పడింది. పదవ తరగతి ఉత్తీర్ణురాలైన సమీనాబేగం చివరకు షాదీ ముబారక్ పథకానికి అర్హురాలిగా మారేందుకు.. తానేమీ చదువుకోలేదన్న ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు