కొడుకే వేధించాడు: కోడెల బంధువు

17 Sep, 2019 04:34 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న సాయిబాబు

పోలీసులకు కోడెల బంధువు కంచేటి సాయిబాబు ఫిర్యాదు

కుమారుడు శివరామ్‌ నుంచి ప్రాణ హాని ఉందని నాతో పలుమార్లు చెప్పాడు 

ఆస్తులు అతని పేర రాయకపోతే చంపుతానని బెదిరించాడు

అతనికి నచ్చజెప్పడానికి విఫలయత్నం చేశానని వెల్లడి

సత్తెనపల్లి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ నేతలు చెబుతున్న తరుణంలో ఆయన కుమారుడు కోడెల శివరామే తీవ్రంగా వేధించాడని మృతుని సమీప బంధువు కంచేటి సాయిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోడెల శివరామ్‌ నన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.. ఆస్తులను తన పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడు. నాకు నా కొడుకు నుంచే నాకు ప్రాణహాని ఉంది’ అని గత నెలలో శివప్రసాదరావు తనతో ఫోన్లో పలుమార్లు ఆందోన వ్యక్తం చేశారని వెల్లడించారు. ఈ విషయం తనతో వ్యక్తిగతంగా కూడా చెప్పారన్నారు.

ఈ మేరకు సోమవారం ఆయన  గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కరరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. కోడెల మృతిని టీడీపీ నేతలు రాజకీయం చేస్తూ.. వైఎస్సార్‌సీపీపై బురద చల్లుతున్న నేపథ్యంలో సాయిబాబు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను గుంటూరు జిల్లా క్రోసూరు మండలం పీసపాడు గ్రామానికి చెందిన వాడినని, వ్యాపార రీత్యా గుంటూరులో నివసిస్తున్నానని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో మరణించిన కోడెల శివప్రసాదరావు తనకు మేనమామ కుమారుడన్నారు. ఆగస్టు నెలలో శివప్రసాదరాడు సెల్‌ నంబర్‌ 9848005923 నుంచి తన నంబర్‌ 6305322989కు పలుమార్లు ఫోన్లు చేసి కుమారుడు కోడెల శివరామ్‌ తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చెప్పాడన్నారు.  

కోడెల మృతికి ఆయన కుమారుడే కారణమంటూ.. పోలీసులకు కోడెల బంధువు కంచేటి సాయిబాబు ఇచ్చిన ఫిర్యాదు   
 
కుమారుడి బారి నుంచి కాపాడాలని కోరారు 
ఆస్తులను తన పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని శివప్రసాదరావు తనతో ఆవేదన పంచుకున్నాడని సాయిబాబు చెప్పారు. తనతో నాలుగు సార్లు వ్యక్తిగతంగా కూడా కోడెల అదే విషయం చెప్పారని వివరించారు. తన కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, అతని బారి నుంచి తనను కాపాడాలని కోరారన్నారు. దీంతో తాను శివరామ్‌కు పలుమార్లు ఫోన్‌ చేసి శివప్రసాదరావును ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించానన్నారు. శివరామ్‌ను కలిసి మాట్లాడదామని ప్రయత్నిస్తే.. అతను కుదరదని చెప్పాడన్నారు. ఇప్పుడు కోడెల మృతి విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కోడెల మృతిపై తనకు అనుమానం ఉందన్నారు. అతని కుమారుడే చంపి లేదా చంపించి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి యత్నిస్తున్నాడని చెప్పారు. ఈ విషయమై పూర్తి స్థాయి విచారణ జరిపించి, ఆయన మరణానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.  

సంబంధిత వార్తలు...
మాజీ స్పీకర్‌ కోడెల ఆత్మహత్య

కోడెల మృతిపై బాబు రాజకీయం!

ఆది నుంచి వివాదాలే!

కోడెల మృతిని రాజకీయం చేయవద్దు

మరిన్ని వార్తలు