కూతురు ముందే పిస్టల్‌తో కాల్చుకుని.. 

6 Nov, 2023 03:41 IST|Sakshi

ఏఆర్‌ ఎస్సై ఫజల్‌ అలీ ఆత్మహత్య 

మృతుడు మంత్రి సబితా  ఇంద్రారెడ్డి వద్ద ఎస్కార్ట్‌ ఆఫీసర్‌ 

ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రాథమిక నిర్ధారణ 

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: ‘గోలీ కొట్టుకుంటా’.. అంటూ రెండుమూడు రోజులుగా సన్ని హితుల వద్ద చెపుతున్న రాచకొండ ఏఆర్‌ ఎస్సై మహ్మద్‌ ఫజల్‌ అలీ (59) పిస్టల్‌తో పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న అలీ, తన చిన్న కుమార్తెతో కలసి ఆదివారం ఉదయం డ్యూటీలో చేరడానికి వచ్చి, ఆమె సమక్షంలోనే ఉసురు తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆర్థిక కారణాల నేపథ్యంలో అలీ సూసైడ్‌ చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన ఫజల్‌ అలీ రాచకొండ కమిషనరేట్‌లో ఏఆర్‌ ఎస్సైగా పని చేస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసినా.. భర్తలతో విడాకులు తీసుకున్న వీళ్లు ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన కుమారుడు ఓ దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు.

చిన్న కుమార్తె వివాహం చేయాలని భావించిన అలీ.. అందుకోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రూ.10 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయనకు కేవలం రెండేళ్లు మాత్రమే సర్విసు ఉండటంతో బ్యాంకు అధికారులు రుణ దరఖాస్తును తిరస్కరించారు. రెండు వారాల క్రితం బ్యాంకు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఫజల్‌ అలీ, రుణం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు.  

నోట్‌ బుక్‌లో రాసుకుని..  
ఈ క్రమంలో రెండుమూడు రోజులుగా తన సన్నిహితులు, సహోద్యోగుల వద్ద ఆర్థిక ఇబ్బందులు, రుణం సమస్య గురించి చెప్పుకుంటున్న ఫజల్‌ అలీ నిరాశతో ‘గోలీ కొట్టుకుంటా’అంటూ వాపోయారు. ఓ నోట్‌ బుక్‌లోనూ తన ఆర్థిక పరిస్థితుల విషయం రాసి ఆ పేజీని తన వెంట ఉంచుకున్నారు. ఆదివారం ఉదయం చిన్న కుమార్తె ఫాతిమాను తీసుకొని శ్రీనగర్‌ కాలనీలోని మంత్రి ఇంటి వద్దకు డ్యూటీ కోసం వచ్చారు. ముందుగా ఆ సమీపంలో ఒక హోటల్‌ వద్ద కూతురిని దించి మంత్రి ఇంటికి వెళ్లారు.

డ్యూటీ ఎక్కిన తర్వాత తన సర్వీస్‌ పిస్టల్‌ (9 ఎంఎం క్యాలిబర్‌) తీసుకొని కుమార్తె ఉన్న చోటుకి వచ్చారు. వీడియో తీయా ల్సిందిగా కుమార్తెకు చెప్పి తన సెల్‌ఫోన్‌ ఇచ్చారు. కొన్ని మాటలు నవ్వుతూ చెప్పిన అలీ, ఆపై ఫోన్‌ తీసుకుని, ఆమెను వెళ్లమని చెప్పారు. కుమార్తె వెనక్కు తిరిగిన వెంటనే ఫోన్‌ జేబులో పెట్టుకుని పిస్టల్‌తో తలపై పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చుకున్నారు. కుడి చెవిపై నుంచి దూసుకుపోయిన తూటా ఎడమ వైపు నుంచి బయటకు వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఫజల్‌ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అలీ కుటుంబీకులకు అప్పగించారు. కాగా, ఫజల్‌ అలీ తండ్రి ఇబ్రహీం అలీ కూడా గతంలో హైదరాబాద్‌లో ఏఆర్‌ ఎస్‌ఐగా పనిచేశారు. ఆయన కూడా ఇలాగే కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంతో 1986లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఏఎస్‌ఐ ఫజల్‌ మృతి పట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫజల్‌ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు