టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలే!

28 Aug, 2019 08:56 IST|Sakshi

ఆరోపణలపై బహిరంగ విచారణకు రావాలంటూ చంద్రబాబుకు సవాల్‌

గురజాల ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి  

సాక్షి, గుంటూరు: పల్నాడు ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు చూసినా అవినీతి, అక్రమాలు, కరువు రాజ్యమేలాయని వైఎస్సార్‌ సీపీ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. గుంటూరులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్నాడులో దుస్థితి ఏ రాష్ట్రంలో లేదని చంద్రబాబు చెబుతున్న మాటలు చూస్తే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 1994 నుంచి 2004 మధ్య కాలంలో నక్సలైట్ల సమస్యతో ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. కొడవలి పట్టుకొని తిరగాల్సిన చేతులు,  తుపాకులు పట్టుకుని తిరిగే దుస్థితి వచ్చిందన్నారు.

గత ఐదేళ్ల  టీడీపీ పాలనలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చేయని అకృత్యాలు లేవన్నారు. అక్రమ మైనింగ్, పేకాట క్లబ్‌లు, నకిలీ విత్తనాలు, కల్తీ మద్యం, లైంగిక దాడులు వంటి ఎన్నో దురాగతాలు జరిగాయన్నారు. వీటిపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధించిన విషయాన్ని గుర్తు చేశారు. గురజాలలో పిచ్చికుక్కపై రాయి వేస్తే దాడి జరిగినట్లు కేసులు పెట్టారని, 70 ఏళ్ల వృద్ధులపై కూడా లైంగిక దాడి కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు  చేశారు.

వై.ఎస్‌.జగన్‌ పాలనలో సంతోషం..
ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఇప్పుడు పల్నాడు ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కృష్ణమ్మ పరవళ్లు తొక్కి ప్రాజెక్టులు అన్నీ నిండాయని, దీంతో రైతులు, రైతు కూలీలు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. గురజాలలో మెడికల్‌ కళాశాల, గురజాల, దాచేపల్లిని మున్సిపాలిటీ చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి నీరు ఇచ్చే విధంగా రూ.500 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ హయాంలో ఒక్క మంచి పనైనా జరిగిందా అని ప్రశ్నించారు. కాసు బ్రహ్మానందరెడ్డి, వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వివరించారు.

బహిరంగ విచారణకు సిద్ధమా?
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి, హైదరాబాద్‌లో కూర్చుని ఏవేవో మాటలు మాట్లాడుతున్నారని, పిన్నెల్లి, మోర్జంపాడు, తురకపాలెం గ్రామాలకు ఆయన రావాలని కోరారు. బహిరంగ విచారణకు సిద్ధమని, ఐజీతో పాటు, ఎస్పీ, పోలీసులు వస్తారని, గత ఐదేళ్ల పాలనలో, ప్రస్తుతం మూడు నెలల వైఎస్సార్‌ సీపీ పాలనలో ఏ పార్టీ వారు  ఎవరిపై  దాడిచేశారో గ్రామాల్లోకి వస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. పల్నాడులో అక్రమాలకు పాల్పడిన వారే గ్రామాలు విడిచి వెళ్లారని, దానిని మరిచి చంద్రబాబునాయుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. పల్నాడు ప్రాంతంలో ఎవరినీ భయపెట్టలేదని, మాకు హింసించే సమయం లేదని, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన తీరులో మార్పు రాలేదన్నారు.

టీడీపీ పాలనలో దొంగల్ని వదిలేశారు 
టీడీపీ పాలనలోనే అక్రమ మైనింగ్‌ జరిగినట్లు ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 96 లక్షల మెట్రిక్‌టన్నుల ఖనిజాన్ని అక్రమ మైనింగ్‌ చేయలేదని, 34 లక్షల మెట్రిక్‌ టన్నుల తెల్ల సున్నపురాయిని మాత్రమే అక్రమ మైనింగ్‌ చేసినట్లు టీడీపీ ప్రభుత్వమే గుర్తించిందన్నారు. అయితే గత ప్రభుత్వం మాత్రం దొంగను పట్టుకోకుండా వదిలేసిందన్నారు. చంద్రబాబు లా అండ్‌ ఆర్డర్‌ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. త్వరలో అక్రమ మైనింగ్‌కు సంబంధించి దోషులను పట్టుకుని వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. సీఐడీ సైతం అక్రమాలు జరిగాయని హైకోర్టుకు  నివేదించినట్లు  తెలుస్తోందన్నారు. 

మరిన్ని వార్తలు