టీడీపీ నేతలు కర్నూల్‌లో హైకోర్టు వద్దనగలరా?

9 Jan, 2020 12:39 IST|Sakshi

సాక్షి, కర్నూలు: అమరావతి విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరు అర్థరహితమని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్లలో అభివృద్ధిని మరిచిన చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటుతో పాటు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కర్నూలు అభివృద్ధికి సీఎం జగన్‌ సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

బి.వై.రామయ్య మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఆయన పేర్కొన్నారు. సీఎం జగనన్న మాట ఇస్తే తప్పే ప్రస్తే లేదని కొనియాడారు. అమరావతిలో జరుగుతున్నది రైతు ఉద్యమం కాదని, చంద్రబాబు బినామీల ఆందోళన మాత్రమేనన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును సమర్థించే టీడీపీ నేతలు కర్నూల్‌లో హైకోర్టు వద్దని చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. రాయలసీమ టీడీపీ నేతలు చంద్రబాబు మాయలో ఉన్నారన్నారు. ఇకనైనా ప్రాంతాల అభివృద్ధి కోసం టీడీపీ నేతలు ఆలోచించాలని కోరారు.

మరిన్ని వార్తలు