టీడీపీపై కావూరి ఘాటైన వ్యాఖ్యలు

27 Aug, 2014 03:12 IST|Sakshi
టీడీపీపై కావూరి ఘాటైన వ్యాఖ్యలు

నాయకుడు కావూరి సాంబశివరావు రెండు రోజులుగా అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. తనదైన శైలిలో అధికార పక్షాన్ని కావూరి టార్గెట్ చేయడం టీడీపీ నేతలను విస్మయానికి గురిచేస్తుండగా, బీజేపీ నేతలకు ఒకింత ఆశ్చర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఎక్కడిక్కడ అరాచకాలకు పాల్పతున్నారు.
 
 మన జిల్లాలోని టి.నరసాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి చెందిన సాగునీటి పైపుల ధ్వంసం, పెదవేగి మండలం అంకన్నగూడెంలో వైఎస్సార్ సీపీ నేతలు, వారి ఆస్తులు, ఇళ్లపై దాడులకు తెగబడటం వంటి ఘటనలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కావూరి సరిగ్గా వీటిపై దృష్టిసారించి టీడీపీ నేతల నిర్వాకాలపై ధ్వజమెత్తుతున్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇటువంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని, టీడీపీ వాళ్లు సరికొత్త ఆగడాలతో, దుష్టరాజకీయ సంస్కృతికి తెరలేపారని ఆయన వ్యాఖ్యానిం చడం గమనార్హం. వైఎస్సార్ సీపీ నేతలపై జరిగిన దాడులు, ఆ పార్టీ నేతలే లక్ష్యంగా టీడీపీ సాగిస్తున్న అరాచకాలను తప్పుపడుతూ పార్టీలకు అతీతంగా కావూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యూయి.
 
 అదేవిధంగా కొల్లేరులో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయని, బీజేపీ శ్రేణులపై జులుం ప్రదర్శిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కావూరి కొయ్యలగూడెంలో సోమవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో హెచ్చరించారు. బీజేపీకి టీడీపీ మిత్రపక్షమైనా సరే తాము అన్యాయాన్ని ఎదుర్కొంటామని, టీడీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని కావూరి విరుచుకుపడటం సంచలనమవుతోంది. వాస్తవానికి ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాకు దూరంగా ఉన్న కావూరి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత జిల్లాకు వచ్చీ రాగానే టీడీపీ నేతల ఆగడాలపై ఎటాక్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది.

 

మరిన్ని వార్తలు