సీఎం సారూ.. నాకు మావోలతో ముప్పుంది

25 Sep, 2018 03:54 IST|Sakshi

‘గ్రామదర్శిని’కి వెళ్లలేనని సీఎం ఎదుట కిడారి వేడుకోలు

అదేమీ కుదరదన్న చంద్రబాబు

గత నెలలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి భేటీలో ఘటన

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘సార్‌.. ! నాకు మావోయిస్టులతో థ్రెట్‌ (ముప్పు) ఉంది. ఏవోబీలో వారి ప్రభావం ఎక్కువగా ఉంది. నా నియోజకవర్గంలోని గ్రామాలన్నీ మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నాయి. ‘గ్రామదర్శిని’కి వెళ్లలేను సారూ... ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాలకు వెళ్లడం ఇబ్బందికరమే. మమ్మల్ని మినహాయించండి సార్‌....!’ సీఎం చంద్రబాబుకు మావోయిస్టుల చేతిలో బలైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వేడుకోలు ఇదీ.

మినహాయించాలంటూ అభ్యర్థన...
గ్రామదర్శిని కార్యక్రమం నుంచి తన నియోజకవర్గాన్ని మినహాయించాలంటూ గత నెలలో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వేడుకున్నారు. అయితే ‘అలాంటిదేమీ కుదరదు.. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలు ప్రతి గ్రామానికీ వెళ్లాల్సిందే. గ్రామ కార్యదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందేనని సీఎం చెప్పటంతో కిడారి చేసేదేమీ లేక భయంభయంగానే మారుమూల ప్రాంతానికి వెళ్లి మావోయిస్టుల చేతిలో మృత్యువాత పడ్డారు.

ఎంత మొత్తుకున్నా వినలేదు...
కిడారి అభ్యర్థనను ముఖ్యమంత్రి మన్నించి ఉంటే ఇప్పుడిలా మావోయిస్టుల తూటాలకు బలయ్యే పరిస్థితి వచ్చేది కాదని ఆయన  అనుచరులు వాపోతున్నారు. ‘ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతి గ్రామానికీ  వెళ్లాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. కిడారి ఎంత మొత్తుకున్నా వినలేదని విశాఖ జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ టీడీపీ నేత పేర్కొన్నారు. 

ఆ లేఖ నిజమేనా...?
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు గ్రామదర్శినికి కార్యక్రమానికి వెళ్తున్నట్లు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. పైగా మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నందున పోలీసుల అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లొద్దంటూ ఈనెల 21న ఎమ్మెల్యేకు అరకు పోలీస్‌స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఐ) లిఖిత పూర్వకంగా నోటీసు జారీ చేసినట్లు పేర్కొంటున్నారు. అయితే కిడారి పీఏ అప్పారావు ఆదివారం ఘటనా స్థలం వద్ద ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఘటనా స్థలంలో అరకు సీఐ వెంకునాయుడు మాట్లాడుతూ నోటీసు ఇచ్చిందీ లేనిదీ తనకు తెలియదని చెప్పారు. కానీ ఎమ్మెల్యే తమ మాటను పట్టించుకోకుండా, తమకు చెప్పకుండా వెళ్లారని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎమ్మెల్యే చెప్పకపోయినా ప్రాణహాని ఉన్నందున ఆయన కదలికలపై నిఘా ఉంచాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మరిన్ని వార్తలు