ఉపాధికి ఢోకా లేదు

5 Nov, 2013 02:42 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘మీరంతా అదృష్టవంతులు.. నాగన్‌పల్లిలో వైట్‌గోల్డ్ స్పింటెక్స్ పార్క్, ఆదిబట్లలోని సమూహ ఏరో స్పేస్ పార్క్‌తో దాదాపు 15వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇందులో అధికభాగం స్థానికులకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. స్థానిక యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేందుకు ఐటీఐ లేదా పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేస్తాం.’ అని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లిలో వైట్‌గోల్డ్ స్పింటెక్స్ పార్క్‌కు శంకుస్థాపన చేశా రు. అనంతరం ఆదిబట్లలోని సమూహ ఏరోస్పేస్ పార్క్‌కు శిలాఫలకం వేశారు.
 
 ఈ సందర్భంగా వేర్వేరుగా ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో సీఎం మాట్లాడారు. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉండడంతో అభివృద్ధి అంతా జిల్లావైపు మళ్లిందని, దీంతో జిల్లాలోని భూముల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. ఇలాంటి పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలోని కొందరు రైతులు భూములు కోల్పోతున్నారని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోపాటు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కానుండడంతో నీటి సరఫరా, విద్యుత్ సరఫరాతోపాటు రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు తగిన ఏర్పాటు చేస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు