దద్దరిల్లిన కోటవురట్ల

21 Aug, 2018 08:11 IST|Sakshi
అశేష జనవాహిని మధ్య కోటవురట్ల సభకు చేరుకుంటున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

జనసంద్రమైన రాజుల కోట

హోరెత్తిన జగన్నినాదాలు

కోటవురట్ల చరిత్రలో భారీ బహిరంగ సభ

సాక్షి, విశాఖపట్నం: కోటవురట్ల జనసంద్రమైంది.. రాజులకోట జగన్నినాదాలతో హోరెత్తిపోయింది. తంగేడు రాజుల కంచుకోటైన కోటవురట్లలో జననేతకు ఘనస్వాగతం లభించింది. మధ్యాహ్నం జల్లూరు నుంచి కోటవురట్లకు బయల్దేరిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట కిలోమీటర్ల కొద్దీ జనం కదంతొక్కారు. సరిగ్గా సాయంత్రం 4.50 గంటలకు కోటవురట్లకు చేరుకోగా అప్పటికే అక్కడ గంటల తరబడి వేలాదిమంది జనం వేచి చూస్తున్నారు. మేడలు మిద్దెలు, ప్లెక్లీలు, కటౌట్లు.. ఇలా ఒకటేమిటి కన్పించిన చోటల్లా జనమే జనం. అడుగు తీసి అడుగు వేయలేనంతగా సభ జరిగే ప్రాంతమంతా కిక్కిసిరిపోయింది. కోటవురట్ల మెయిన్‌రోడ్డు మొదలుకొని రాజుల తంగేడు వరకు రోడ్డంతా జనంతో నిండి పోయింది. సభ జరిగిన ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. సభ ముగిశాక ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడానికి సుమారు రెండుగంటలకు పైగా సమయం పట్టింది. రాత్రి ఎనిమిది గంటల వరకు సభకు వచ్చిన జనం వెళ్తూనే ఉన్నారు. కోటవురట్ల చరిత్రలో ఇంతటి భారీ çసభ ముందెన్నడూ చూడలేదని మండలవాసులు చెబుతున్నారు. నర్సీపట్నం సభకు దీటుగా ఇక్కడ జనం పోటెత్తారని ఇంటిలిజెన్స్‌ వర్గాలు సైతం ప్రభుత్వానికి నివేదించాయి.

చక్కెర కర్మాగారాలపైప్రభుత్వ తీరును ఎండగట్టిన జగన్‌
సహకార చక్కెర కర్మాగారాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వైఎస్‌ జగన్‌ తన ప్రసంగంలో ఎండగట్టారు. దివంగత వైఎస్సార్‌ హయాంలో లాభాలబాటలో నడిచిన ఈ కర్మాగారాలు నేడు నష్టాల బాటçపట్టడానికి చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించినప్పుడు రైతుల నుంచి విశేష స్పందన లభించింది.చంద్రబాబు సీఎం అయ్యాక విశాఖ జిల్లాలో తుమ్మపాల, శ్రీకాకుళంలో భీమసింగి, విజయనగరంలోని ఆమదాలవలస ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.. విశాఖ జిల్లాలోని తాండవ ఫ్యాక్టరీ రూ.40 కోట్లు,  ఏటికొప్పాక

ఫ్యాక్టరీ 22కోట్లు, చోడవరం ఫ్యాక్టరీ రూ.100 కోట్ల
నష్టాల్లో ఉన్నాయనగానే రైతులు అవును.. అవును అంటూ బిగ్గరగా అరిచారు. కోటవురట్ల సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తంగేడు రాజులైన మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, పార్టీ అదనపు కార్యదర్శి దత్తుడు సీతబాబు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఆర్‌.ఎస్‌. రామచంద్రరాజు, ఏటికొప్పాక సుగర్స్‌ మాజీ చైర్మన్‌ రామభద్రరాజు తదితరులు విజయవంతం చేశారు. ఊహించని రీతిలో ప్రజలు కూడా స్వచ్చందంగా ఈ సభకు తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం వెల్లివిరిసింది.

మరిన్ని వార్తలు