అదరగొట్టిన బెజవాడ కుర్రోడు

17 Jan, 2020 03:34 IST|Sakshi

సీఏలో ఆలిండియా టాపర్‌గా జి.కృష్ణప్రణీత్‌

మరో విద్యార్థి ఆంజనేయ వరప్రసాద్‌కు 46వ ర్యాంకు 

విజేతలిద్దరూ తొలి ప్రయత్నంలోనే ర్యాంకుల సాధన

ఫస్ట్‌ ర్యాంకర్‌ తండ్రి ఆటోమొబైల్‌ షాపులో గుమస్తా

లబ్బీపేట (విజయవాడ తూర్పు) : ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ (ఐసీఏఐ) గురువారం ప్రకటించిన సీఏ ఫైనల్స్‌ ఫలితాల్లో విజయవాడ విద్యార్థి జి కృష్ణప్రణీత్‌ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించి తన సత్తా చాటాడు. విజయవాడకే చెందిన మరో విద్యార్థి వి ఆంజనేయ వరప్రసాద్‌ కూడా జాతీయ స్థాయిలో 46వ ర్యాంకు సాధించాడు. వీరిద్దరూ పరీక్షలకు హాజరైన మొదటిసారే ర్యాంకులు సాధించడం విశేషం. వీరు శిక్షణ పొందిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ తుమ్మల రామ్మోహనరావు కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. కృష్ణప్రణీత్‌ తండ్రి జి మధుసూదనరావు ఆటోమొబైల్‌ షాపులో గుమస్తాగా పనిచేస్తుండగా, తల్లి మల్లేశ్వరి గృహిణి. మరోవైపు.. పరీక్ష రాసిన రోజే క్వాలిఫై అవుతానని భావించానని, ఇప్పుడు ఆలిండియా 46వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందని మరో విజేత వి ఆంజనేయవరప్రసాద్‌ తెలిపాడు. ర్యాంకులు సాధించిన విజేతలిద్దరికీ రామ్మోహనరావు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.

మంచి మార్కులు వస్తాయనుకున్నా..
పరీక్ష రాసిన రోజునే మంచి మార్కులు వస్తాయని అనుకున్నా. ఈ రోజు ఐసీఏఐ వాళ్లు ఫోన్‌చేసి ఫస్ట్‌ ర్యాంకు వచ్చిందని చెబితే ఏం మాట్లాడాలో తెలీలేదు. ఇంత గొప్ప ర్యాంకు సాధించడానికి కారణం నా తల్లిదండ్రులే. వారు నన్ను మానసికంగా అన్ని రకాలుగా ప్రోత్సహించడంతోనే ఈ ర్యాంకు సాధించగలిగా. నేను ముందు రెండేళ్లు ఆర్టికల్స్‌ చేశా.. ఆ తర్వాత ఒక ఏడాది సిలబస్‌ చదవా. తొలి ప్రయత్నంలోనే ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించడం చాలా సంతోషంగా ఉంది. మంచి శిక్షణనిచ్చి నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించిన సీఏ టి రామ్మోహనరావుకు కృతజ్ఞతలు.  

మరిన్ని వార్తలు