విభజనకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి:లగడపాటి

13 Jul, 2013 21:38 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ 2004లో సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. 2004, 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ వాదన నెగ్గలేదన్నారు.

ఈ నెలాఖరులోపు కాంగ్రెస్ తన అభిప్రాయం చెబుతుందని పేర్కొన్నారు. విభజిస్తే కాంగ్రెస్కు మంచి ఫలితాలు వస్తాయనడంలో వాస్తవంలేదన్నారు. డిసెంబరు 9 ప్రకటన శాసనసభ తీర్మానంతో ముడిపడినదన్నారు. తీర్మానానికి టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ అంగీకరించలేదని చెప్పారు.  రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని తమకు విశ్వాసం ఉందన్నారు.  విద్వేషాలను రెచ్చగొట్టి రాష్ట్రాన్ని విభజించాలని అనుకోవడం వేర్పాటు వాదమే అన్నారు. విడిపోతే తెలంగాణ బికారి అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమైక్యంగా ఉంటే 30 ఎంపి స్థానాలు గెలుచుకుంటామని చెప్పారు.

తెలంగాణలో భావోద్వేగాలు తగ్గడానికి సొసైటీ ఎన్నికలే నిదర్శనం అన్నారు. ఉన్న కొద్దిపాటి భావోద్వేగాలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతరిస్తాయని చెప్పారు. దివంగత  డాక్టర్ వైఎస్ఆర్ ఏనాడు రాష్ట్రాన్ని విభజిస్తామనలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం పథకాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ను గెలిపించారని చెప్పారు. రెండో ఎస్సార్సీయే మార్గమని పలు సందర్బాల్లో చెప్పిందే నిజమవుతోందన్నారు. ప్రమాదం తొలగిపోలేదని, ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన జరగొచ్చనే ఆందోళన కూడా ఉందన్నారు.

రెండు వాదనల మధ్య పోటీకి హైకమాండ్ రెఫరీ మాత్రమేనని  లగడపాటి అన్నారు. సమైక్యాంధ్ర తరపున గట్టిగా బ్యాటింగ్ చేస్తున్నది ఎవరనేది తాను ఇప్పుడే చెప్పలేనన్నారు.

మరిన్ని వార్తలు