లక్ష బోగస్ రేషన్‌కార్డులున్నాయ్

25 Dec, 2013 05:07 IST|Sakshi

బి.కొత్తకోట, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా లక్ష బోగస్ తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్టు గుర్తించామని జాయింట్ కలెక్టర్ బసంత్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన బి.కొత్తకోటలోని పౌరసరఫరాల స్టాక్‌పాయింట్‌ను తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడో విడత రచ్చబండలో జిల్లాలో 45వేల రేషన్‌కార్డులను పంపిణీచేసామని, వీటిని కలుపుకుంటే మొత్తం 10,37,490 తెల్ల కార్డులున్నాయన్నారు.

వీటన్నింటికీ అమ్మహస్తం సంచులు వచ్చాయని,అందులో లక్షమంది సంచులను తీసుకోలేదన్నారు. దీన్నిబట్టి లక్ష రేషన్‌కార్డులు బోగస్‌గా భావిస్తున్నామన్నారు. 28లక్షల రేషన్‌కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేశామని, మిగిలిన కార్డులకు ఆధార్‌సంఖ్య రాకుంటే వాటిని కూడా బోగస్‌కార్డులుగానే గుర్తిస్తామన్నారు. పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో సాహసక్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం కేటాయించనున్న మూడెకరాల భూమి విలువ రూ. 3కోట్లుగా నిర్ణయించనున్నామని చెప్పారు. దీన్నే ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

పామాయిల్‌పై రాయితీని కేంద్రం ఉపసంహరించుకోవడంతో 975 మెట్రిక్‌టన్నుల పామాయిల్ జిల్లాకు రాలేదన్నారు. చౌక బియ్యం కర్ణాటకకు తరలిపోయి అక్కడ పాలిష్‌చేసిన బియ్యాన్నే రూ. 40కు విక్రయిస్తున్న విషయమై స్పందిస్తూ బి.కొత్తకోటలో కిలో రూ. 30కు సోనా మసూరి బియ్యం విక్రయించే కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆయన వెంట పౌరసరఫరాల డీఎం సత్యనారాయణరెడ్డి, తహశీల్దార్ వెంకటరమణారెడ్డి ఏఆర్‌ఐ శ్రీనివాసులురెడ్డి, సీఎస్‌డీటీ హరిప్రసాద్, గోదాము డీటీ భానుమూర్తి ఉన్నారు.
 

మరిన్ని వార్తలు