ఆంధ్రాలో భారీగా రిజిస్ట్రేషన్ల ఆదాయం

15 Oct, 2014 02:31 IST|Sakshi
ఆంధ్రాలో భారీగా రిజిస్ట్రేషన్ల ఆదాయం

* సెప్టెంబర్‌లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చింది రూ. 255 కోట్లు
* పన్నుల ద్వారా ఆదాయం   రూ. 2,747 కోట్లు
* ఈ ఆర్థిక ఏడాది సెప్టెంబరు వరకు   రూ. 24,070 కోట్ల ఆర్జన
* గతేడాది ఇదే కాలంలో వచ్చింది   రూ. 22,557 కోట్లు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో భూముల క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. ఇందుకు ప్రబల నిదర్శనం రాష్ట్రం విడిపోయిన తరువాత వరుసగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు మూడు నెలల పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరగడమే. సెప్టెంబర్ నెలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.255 కోట్లు వచ్చింది. జూలై నెలలో 250 కోట్ల రూపాయలు ఆదాయం రాగా, ఆగస్టు నెలలో 213 కోట్లు సమకూరింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో పన్నుల ద్వారా 2,747 కోట్ల రూపాయల ఆదాయం రాగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాకు 58 శాతం మేర ఆదాయం లెక్క కడితే 2,854 కోట్ల రూపాయల ఆదాయం పన్నుల రూపంలో వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మే వరకు ఆంధ్రాకు 58 శాతం, జూన్ నుంచి రాష్ట్రం విడిపోయాక సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్ను ఆదాయం లెక్క కడితే 24,070 కోట్ల రూపాయలు వచ్చింది.

ఇదే గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 58 శాతం మేర లెక్క కడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22,557 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇదే తరహాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు పన్నేతర ఆదాయం 2,246 కోట్ల రూపాయలు రాగా గత ఆర్థిక సంవత్సరంలో 2,165 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా ఉన్నప్పటికీ పన్నేతర ఆదాయం పెద్దగా రావడం లేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నా యి. పన్నేతర ఆదాయం పెంచుకోవడానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు