స్థలం మీదే.. రిజిస్ట్రేషన్ కాదు

27 May, 2016 13:42 IST|Sakshi

 ప్రజల సొంత స్థలాలు సైతం అసైన్డ్ ల్యాండ్స్‌గా నమోదు
 ఆన్‌లైన్ చేసిన భూమి రికార్డులు తప్పుల తడక
 మార్పు చేయని అధికారులు
 రిజిస్ట్రేషన్లకు తీవ్ర విఘాతం

తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొర్రా నాగేశ్వరరావుకు కడకట్ల రెవెన్యూ పరిధిలోని మాగంటి కల్యాణ మండపం సమీపంలో సర్వే నంబర్ 252, 253లలో 421 చదరపు గజాల ఖాళీ స్థలం ఉంది. దానికి డెరైక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ (డీటీసీపీ) అనుమతి మంజూరైంది. లే అవుట్ పర్మిషన్ (ఎల్‌పీ) నంబర్ కూడా ఉంది. ఆ స్థలాన్ని వేరే వ్యక్తులకు బేరం పెట్టిన నాగేశ్వరరావు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే.. రిజి స్ట్రేషన్ చేయడం కుదరదని రిజిస్ట్రార్ చెప్పారు. అదేమని అడిగితే ఈ స్థలం నిషేధిత (ప్రొహిబిటెడ్) జాబితాలో ఉందన్నారు. ఆ స్థలానికి సంబంధించి దస్తావేజులు, ఇతర రికార్డులన్నీ పక్కాగా ఉన్నా.. ఇది అస్సైన్డ్ ల్యాండ్ అని, అలాంటి భూముల్ని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని తెగేసి చెప్పారు. రెవెన్యూ కార్యాలయానికి వెళితే.. అది అస్సైన్డ్ ల్యాండ్ కానేకాదని.. పక్కా జిరాయితీ భూమి అని స్పష్టం చేస్తున్నారు. ‘ఇది మీ స్థలమే కానీ.. పొరపాటున ప్రొహిబిటెడ్ లిస్ట్‌లోకి వెళ్లింది. రికార్డుల్ని సరిచేసి ఉన్నతాధికారులకు పంపించాం’ అని చెబుతున్నారు. నాగేశ్వరరావు ఆ స్థలం విషయమై ఆరు నెలలుగా సబ్ రిజిస్ట్రార్, తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు.

 ఇలాంటి కేసులెన్నో
ఈ పరిస్థితి ఒక్క నాగేశ్వరరావుకు మాత్రమే పరిమితం కాలేదు. తాడేపల్లిగూడెంలోని భూపాల్‌నగర్ ప్రాంతంలో చాలామంది ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉంది. ప్రతి పట్టణంలోనూ కనీసం 30శాతం సొంత స్థలాలు అస్సైన్డ్ ల్యాం డ్స్‌గా ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదయ్యాయి. సొంత స్థలాలను అవసరాల నిమిత్తం అమ్ముకోవడం, ఇంటి ఆడపడుచులకు పసుపు కుంకుమల కింద ఇవ్వడం వంటి సందర్భాల్లో వీటిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు వెళ్లే వ్యక్తులు రిజిస్ట్రేషన్ కాక ఇబ్బందుల పాలవుతున్నారు.

ఉదాహరణకు ఇలా..
తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ పరిధిలో తాడేపల్లిగూడెం, కడకట్ల, తాళ్లముదునూరుపాడు, యాగర్లపల్లి పేరిట నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి పూర్వమే రెవెన్యూ సర్వే నంబర్లు కేటాయించారు. ఆ నంబర్లను ఆన్‌లైన్‌చేసే సమయంలో పొరపాట్లు దొర్లాయి. కడకట్ల రెవెన్యూ పరిధిలోని భూముల క్రమవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆన్‌లైన్‌లో ఆ గ్రామ సర్వే నంబర్‌ను నమోదు చేస్తే ప్రభుత్వానికి చెందిన భూముల సర్వే నంబర్ కనెక్ట్ అవుతోంది. ఆన్‌లైన్ రికార్డుల్లో ఆ స్థలం అసైన్డ్ ల్యాండ్‌గా నమోదై ఉండటంతో రిజిస్ట్రేషన్ జరగడం లేదు. సొంత స్థలాలు, భూములు ప్రభుత్వ ఆస్తులుగా రికార్డులలో పొరపాటుగా నమోదు చేయడంతో వాటి యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాడేపల్లిగూడెంలో 30శాతం సర్వే నంబర్లలోని జిరాయితీ భూములు, లే-అవుట్ స్థలాలు ప్రభుత్వ ఆస్తులుగా నమోదయ్యాయి.

 అన్ని జిల్లాల్లో పరిష్కారమైనా..
రెవెన్యూ రికార్డులను, సర్వే నంబర్ల వివరాలను ఆన్‌లైన్ చేసే సందర్భంలో పొరపాట్ల వల్ల ఏపీలోని 13 జిల్లాల్లో ఇదే సమస్య తలెత్తింది. ఒక్క పశ్చిమ గోదావరి మినహా 12 జిల్లాల్లో వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఆన్‌లైన్ రికార్డుల్లో మార్పులు చేయడంతో అక్కడ సమస్య పరిష్కారమైంది. మన జిల్లాలో మాత్రం ఐదేళ్లుగా ఈ సమస్య వేధిస్తూనే ఉంది. ప్రభుత్వ ఆస్తులుగా పరిగణించే వాటికి ఫారం 22 (ఏ), ఫారం 22(ఈ) ఆధారంగా తప్పులు సరిచే సి కొత్త జాబితాలు తయారు చేయక పోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఫలితంగా సొంత భూమిదారులకు ఐదేళ్లుగా ఇబ్బందులు తప్పడం లేదు.

 రిజిస్ట్రేషన్ చేయలేం
 మునిసిపాలిటీల పరిధిలో రెవెన్యూ గ్రామాలకు సంబంధించి సర్వే నంబర్లను నమోదు చేయడంలో పొరపాట్లు జరిగాయి. ఈ కారణంగా ఆయా రెవెన్యూ గ్రామాల్లోని స్థలాలు, పొలాల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయడం వీలు కావడం లేదు. సదరు స్థలాలు, పొలాలు ఆన్‌లైన్ రికార్డులలో అస్సైన్డ్ ల్యాండ్స్‌గా ఉన్నాయి. అలా నమోదైన భూములు, స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. వీటికి రిజిస్ట్రేషన్ చేయాలంటే కలెక్టర్ నుంచి నిరభ్యంతర (నో అబ్జెక్షన్) ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాలి.
 - గునుపూడి రాజు, సబ్ రిజిస్ట్రార్, తాడేపల్లిగూడెం

 మార్పులు చేసి పంపించాం
భూముల రికార్డుల వివరాల నమోదులో జరిగిన పొరపాట్లను సరిచేసి ఉన్నతాధికారులకు పంపించాం. అవి అధికారికంగా ఆమోదం పొందాల్సి ఉంది. తాడేపల్లిగూడెం పట్టణంలోని భూపాల్ నగర్ పూర్వం గ్రామకంఠంగా ఉండేది. తర్వాత ఆ భూముల్లో భవనాలు వెలిశాయి. రికార్డులలో సర్వే నంబర్లు మారాయి. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సర్వే నంబర్లలో ఉన్న ఆస్తులు, యజమానుల వివరాలను అధికారులకు పంపించాం. అవి మారి రావాల్సి ఉంది.
- పాశం నాగమణి, తహసీల్దార్, తాడేపల్లిగూడెం
 
 

మరిన్ని వార్తలు