ఏవోబీలో సంచలనం

21 Oct, 2014 01:19 IST|Sakshi
ఏవోబీలో సంచలనం
  • సాగుల సంఘటనకు భిన్నంగా నిలిచిన వీరవరం
  •  వర్గపోరుగా చీలిపోతున్న మావోయిస్టుల ఉద్యమం
  •  ఇన్‌ఫార్మర్ల హత్యలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
  •  కేంద్ర కమిటీకి గతంలో లేఖ రాసినట్టుగా వార్తలు
  • కొయ్యూరు : కిందటేడాది సాగులలో మావోయిస్టులు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేస్తూ ముగ్గురిని చంపడం నాడు పెద్ద సంచలనమైంది. ఇప్పుడు మావోయిస్టులు కోరుకొండ సమీపంలో వీరవరం వద్ద గిరిజనులు చేతిలో మరణించడం వర్గ చీలికను నిర్ధారిస్తోంది. వ్యక్తిగత కారణాలు, కుటుంబ కలహాలతోనే కొందరిని ఇన్‌ఫార్మర్ల పేరిట మావోయిస్టులు చంపేస్తున్నారన్న ఆరోపణలు బాధిత కుటుంబాల నుంచి  వెల్లువెత్తుతున్నాయి.

    గతంలో ఒక  మావోయిస్టు నేత ఇన్‌ఫార్మర్ల హత్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర కమిటీకి లేఖ రాసినట్టుగా వార్తలు వచ్చాయి. 2007లో గూడెం మండలంలో అప్పటి కేంద్ర కమిటీ సభ్యులు వక్కాపూడి చంద్రమౌళి అలియాస్ దేవన్నను చంపేసినప్పుడు విశాఖ మన్యంలో గిరిజనులు అతనిపై అభిమానంతో వారం పాటు తిండితిప్పలు మానేసి విషాదంలో మునిగిపోయారు. ఇప్పుడు అలా గిరిజనుల గుండెల్లో నిలిచిపోయే నేతలు ఎందరు ఉన్నారో చెప్పడం కష్టం. గిరిజనుల నుంచి వ్యతిరేకత వస్తే మావోయిస్టులు ఈస్టు డివిజన్‌లో మనుగడ సాగించడం కష్టమే.
     
    ఒకే సామాజికవర్గంపై దాడులు?

    1983లో ఈస్టు డివిజన్ ఏర్పడినప్పుడు ఏ సామాజిక వర్గాలు ఉద్యమాన్ని ముందుకు నడిపించాయో అవి నేడు పూర్తిగా అభివృద్ధి  చెంది మరోవైపు పయనిస్తున్నాయి. దీంతో మావోయిస్టులలో దశాబ్దం నుంచి మరో సామాజిక వర్గం చేరింది. ఎక్కువ మంది సభ్యులు  దానికి చెందినవారే ఉన్నారు. ఆ సామాజిక వర్గం రాక తో మన్యంలో రెండు సామాజిక వర్గాల మధ్య వైరం పెరిగింది. మావోయిస్టులు కరువుదాడుల పేరిట ఒకే సామాజిక వర్గం ఇళ్లను దోచుకోవడం ఆగ్రహాన్ని కలిగించింది.

    వారి భూములను కూడా పంచేయడంతో వలసలు పోయారు. దీనిపై లోలోపల రెండు వర్గాల మధ్య  ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ ఉన్న వారిపై  ఆజమాయిషీ చే యడం మరింత అసంతృప్తిని రగిలించింది.  ఇదిలా ఉంటే మిలీషియా సభ్యులుగా చేరుతున్న సామాజికవర్గంపై వేరే సామాజిక వర్గం గుర్రుగా ఉంది.  వారి మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీని మూలంగా మావోయిస్టులకు గిరిజనులకు మధ్య దూరం పెరిగింది.

    2013 ఫిబ్రవరి సాగుల ఘటన రెండు వర్గాల మధ్య చోటు చేసుకుంది. గొడవను పరిష్కారం చేసేందుకు వచ్చిన మావోయిస్టుల తీరు నచ్చక ఒక వర్గం మావోయిస్టులపై  దాడికి దిగింది.  మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉండడంతో దాడికి దిగిన వర్గానికి  చెందిన గిరిజనులను చంపేశారు. ఈ ఘటనలో అంతా మావోయిస్టులను వేలెత్తి చూపించారు.

    తాజాగా చింతపల్లి మండలం బలపంకు సమీపంలో వీరవ రంలో జరిగిన సంఘటనలో మావోయిస్టులపై ఉన్న ఆగ్రహాన్ని  గిరిజనులు చూపించారు. మావోయిస్టులపై తిరగబడ్డారు. వారిలో మిలీషియా కమాండర్‌గా వ్యవహరిస్తున్న సీందరి చిన రంగారావు అలియాస్ శరత్‌ను, మరో ఇద్దరిని చంపేశారు. బూదరాళ్ల పంచాయతీ కన్నవరానికి చెందిన శరత్‌ను గాలికొండ ఏరియా కార్యదర్శిగా చేయాలని ఇటీవలే మావోయిస్టు ఈస్టు డివిజన్ నిర్ణయించినట్టుగా తెలిసింది.

మరిన్ని వార్తలు