చంద్ర‘లేఖ’.. నవ్వులపాలు.. ఇంతకీ ఆ లెటర్‌ రాసిందెవరు?

25 Oct, 2023 12:32 IST|Sakshi

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని అబద్దాల ఫ్యాక్టరీగా మార్చేశారని మరోసారి రుజువు అయింది. అవినీతి కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాసినట్లు ఆ పార్టీ చేసిన ప్రచారం ఇందుకు దర్పణం పడుతుంది. తదుపరి అది చంద్రబాబు రాసిన లేఖ కాదని బహిర్గతం అవడంతో మళ్లీ టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి దానికి కలరింగ్ ఇచ్చి, అదేదో చంద్రబాబు ములాఖత్ లో చెప్పారని, వాటిని ఆయన కుటుంబ సభ్యులు క్రోడీకరించి రాశారని ప్రచారం చేశాయి.

✍️ఒక రాజకీయ పార్టీ ఇంతలా అసత్యాలు చెప్పడం ఎంత దారుణం. ఈ విషయంలో చంద్రబాబుది ఒక రికార్డేనని అనేక దృష్టాంతాలు తెలియచేస్తాయి. జైలు శాఖ అధికారులు అసలు అలాంటి లేఖ ఏదీ చంద్రబాబు రాయలేదని, తమకు తెలియకుండా ఎలాంటి లేఖలు బయటకు వెళ్లవని చెప్పడంతోనే నిజం వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు ఎన్.టి.రామారావు ఆధ్వర్యంలో టీడీపీ నడిచే రోజుల్లో మరీ ఇంత దిగజారి అబద్దాలు చెప్పడానికి వెనుకాడేవారు. కాని ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది మొదలు పూర్తి విరుద్దంగా వ్యవహారాలు సాగుతున్నాయి. కొంతకాలం అది వాటంగానే ఆయనకు ఉపయోగపడిందని చెప్పాలి.

✍️ఒక చోట చెప్పిన మాట ఇంకో చోట చెప్పకపోవడం, ఒకదానికి విరుద్దంగా మరోకటి చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అప్పట్లో సోషల్ మీడియా లేదు. రాజకీయ ప్రత్యర్ధులకు మీడియా అండ లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిని ఆయన ఆకట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. టీడీపీ, లేదా చంద్రబాబు ఒక అబద్దం ఏదైనా ప్రచారం చేయాలని అనుకున్నా, వెంటనే పసికట్టే మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో అయితే సాధికారికంగా దీనికి సంబంధించిన కథనాలు వెలువడుతున్నాయి. అందువల్లే వారి ఆటలు గతంలో మాదిరి  నడవడం లేదు.

✍️తాజాగా చంద్రబాబు రాసినట్లు చెబుతున్న ఈ లేఖను చదివితే విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఆ లేఖలో వాడిన  భాష చంద్రబాబుది కాదు. ఆయనకు అంత భాషా జ్ఞానం లేదన్నది అందరికి తెలిసిన రహస్యమే. అలాగే ఆయన కుమారుడు లోకేష్‌కు అసలు తెలుగే అంతంతమాత్రంగా వచ్చు. ఈ మధ్యే కాస్త బెటర్‌గా మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తికి ఇలా లేఖ రాయగలరని ఊహించలేం. ఎవరో అద్దె కవి లేదా అద్దె రచయిత తయారు చేసిన లేఖ ఇదని అర్దం అయిపోతోంది. అందులో ఆయన తాను జైలులో లేనని, ప్రజల హృదయాలలో ఉన్నానని కవితాత్మక ధోరణిలో పేర్కొన్నారు. కవిత్వమే రాని చంద్రబాబుకు ఈ డైలాగులు ఎలాగూ రావు.

✍️ఇదంతా అతిశయోక్తులు, అసత్యాలతో రాశారు. తానే భువనేశ్వరిని యాత్ర చేయాలని కోరినట్లు తెలిపారు. భువనేశ్వరి యాత్రపై ప్రజలలో వ్యతిరేకత రాకుండా ఉండడానికి, ఒకపక్క భర్త జైలులో ఉంటే, ఆమె ఇలా జైలులో తిరుగుతారా అన్న విమర్శ రాకుండా ఉండడానికి చంద్రబాబు ఈ ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. ఇంతవరకు జైలులో చర్చించుకుని ఉండవచ్చు. కాని దీనినే  ఆయన  లేఖగా రాశారన్నది అబద్దమని తేలుతుంది. జగన్ నియంత అని చంద్రబాబు అన్నారట. దీనిని బట్టి జగన్ శక్తి సామర్ధ్యాలు ఇప్పటికి చంద్రబాబుకు తెలిశాయన్నమాట. ఆయనను ఏ మాట బడితే ఆ మాటతో దూషించి, అధికారంలోకి వచ్చిన వెంటనే జైలుకు పంపుతామని చెబుతూ సైకో భాష వాడుతూ వచ్చిన చంద్రబాబు తాను జైలుకు వెళితే మాత్రం నియంత అని అంటున్నారు.

✍️న్యాయమే గెలుస్తుందని, తాను తప్పు చేయనని, చేయలేదని అంటున్నారే కాని ,తనపై వచ్చిన స్కిల్ కేసులోని ఆరోపణల గురించి ఎందుకు ఒక్క ముక్క చెప్పలేకపోయారు?వాటిలో ఉన్న అభియోగాలకు కొన్నిటికైనా సమాధానం ఇచ్చి ఉండవచ్చు కదా! అలా ఇచ్చే పరిస్థితి లేదు కనుకే అతి తెలివిగా జైలులో ఉన్నప్పటికి ప్రజల గురించే ఆలోచిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కుట్రతో అవినీతి ముద్ర వేసే ప్రయత్నం అని అన్నారే కాని, అది ఏ రకంగా కుట్రో తెలపలేకపోయారు. ఓటమి భయంతో జైలు గోడల మధ్య బందించారని ఆయన అంటున్నారు.

✍️అవినీతి కేసులో జైలులో పడిన మాట నిజమే. కాని ఆ తర్వాత ఆయనను రిమాండ్‌కు పంపింది కోర్టులు కదా! వాటిలో ఆయనకు అనుకూలమైన ఫలితాలు ఇంతవరకు రాకపోవడం వల్ల కదా ఆయన జైలులో ఉండవలసి వస్తోంది. ఆయన అవినీతికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టులు వ్యాఖ్యానించిన విషయాన్ని జనం మర్చిపోవాలన్నది ఆయన కోరిక కావచ్చు.  ఆ విషయం చెప్పకుండా, జనాన్ని మభ్య పెట్టాలని చూడడమే ఆక్షేపణీయం. ప్రజలే తన కుటుంబమని సెంటిమెంట్ డైలాగులు చెప్పడానికి బాగానే ఉంటాయి.కాని సెంటిమెంటు కోసం అబద్దపు లేఖలు సృష్టిస్తే ఇంకా ఏమైనా కాస్తో, కూస్తో మిగిలి ఉన్న పరువు కూడా పోతుందని చెప్పాలి. తెలుగుదేశం కార్యకర్తలలో ఏర్పడిన నైరాశ్యాన్ని ఇలాంటి దొంగ లేఖల ద్వారా  తొలగించడానికి  ప్రయత్నించబోయి భంగపడ్డారని అనుకోవచ్చు.


-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

మరిన్ని వార్తలు