ఆరని కన్నీటి చారిక

13 Jul, 2016 23:49 IST|Sakshi

 ఏడాదైపోయింది... అయినా ఆ పుణ్య గోదారి గట్టుపై కన్నీరు ప్రవహించిన క్షణాలు ఇంకా ఎవరూ మరిచిపోలేదు. వేలాది మంది మధ్య ఆ అభాగ్యులు చేసిన ఆర్తనాదాలు ఎవరి చెవినీ విడిచి పోలేదు. పుణ్యం కోసమని వెళ్లి కన్ను మూసిన ఆవేదనాభరిత సంఘటనలు ఎవరి మదిలోనూ చెరిగిపోలేదు. గత ఏడాది ఇదే రోజు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగింది. అందులో జిల్లా వాసులు తొమ్మిది మంది చనిపోయారు. ఆ కుటుంబాలు ఏడాది దాటినా ఇంకా తేరుకోలేదు. వారి రోదనలు ఇంకా ఆగలేదు. ఆర్థిక సాయాలు, పరామర్శలు, సానుభూతులు వారి బాధను దూరం చేయలేకపోతున్నాయి. కొడుకును కోల్పోయి ఒకరు, తల్లిని కోల్పోయి మరొకరు, కుటుంబాన్నంతా కోల్పోయి మరొకరు పడుతున్న వేదన ఏ కొలమానానికీ అందనిది. వీరి కన్నుల్లో గోదావరి ఇంకా ప్రవహిస్తోంది. ఆ కన్నీటి ప్రవాహానికి ఈ కథనాలే సాక్షి.
 
 ఆమదాలవలస: ఏడాది అయ్యింది. ఉత్సాహంగా గోదావరి పుష్కరాలకు వెళ్లిన వారు ఊపిరి అక్కడే వదిలేసి వచ్చి. ఘటన జరిగి ఏడాదైనా మృతుల కుటుంబాల్లో కన్నీరు ఇంకా ఆగలేదు. తమ కుటుంబ సభ్యులకు ఇప్పటి కీ మరువలేకపోతున్నామని ఆమదాలవలస పట్టణానికి చెందిన వారంటున్నారు. పట్ణణంలో కొత్తవీధిలోగల పొట్నూరు అమరావతి, ఆమె చెల్లెలు పొట్నూరు లక్ష్మి, తల్లి కొత్తకోట కళావతి (సంతకవిటి మండలం, బొద్దూరు గ్రామం), కళావతి మనుమడు బరాటం ప్రశాంత్(శ్రీకాకుళం బలగ)మరో పదిమంది కుటుంబ సభ్యులు గత ఏడాది జూలై 13న ఆమదాలవలసలో రెలైక్కి గోదావరి పుష్కరాలకు వెళ్లారు. రాజమండ్రిలో కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న అమరావతి కుమారుడు నవీన్(బ్యాంకు టెస్ట్‌లకు కోచింగ్ తీసుకుంటున్నాడు) గదికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని ఉదయాన్నే నాలుగు గంటలకు బయల్దేరి పుష్కర ఘాట్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో పైన తెలిపిన నలుగురూ మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆమదాలవలస ఉలిక్కిపడింది.
 
 అన్నింటా అమ్మే...
 ‘నాకు ఊహ తెలిసిన నుంచి కష్టం అంటే ఏమిటో తెలియకుండా నన్ను, తమ్మడిని అమ్మే పెంచింది. గోదావరి పుష్కరాలకు నాన్న పొట్నూరి వీరబ్రహ్మం, అమ్మ అనంతలక్ష్మి, తమ్ముడు సాయిభరత్‌కుమార్ కలిసి వెళ్లాం. అక్కడ పుష్కరాల్లో మొదటిరోజు జరిగిన తొక్కిసలాటలో అమ్మ చనిపోయింది. అమ్మ లేకపోవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అమ్మ జ్ఞాపకాలే ముందుకు నడిపిస్తున్నాయి.’ అని శ్రీకాకుళానికి చెందిన పొట్నూరి హరిణి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతలక్ష్మి భర్త వీరబ్రహ్మం మాట్లాడుతూ లక్ష్మి జ్ఞాపకాలతోనే బతుకుతున్నట్లు చెప్పారు. బతుకు తెరువుకోసం ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం వచ్చామని, తనకు మొదటి నుంచి అన్నింటా చేదోడువాదోడుగా ఉన్న భార్య చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు.
 
 ప్రశాంత్ జ్ఞాపకాలతోనే...
 మా కుమారుడు బరా టం ప్రశాంత్‌కుమార్ జ్ఞాపకాలతోనే ఇంకా మేం ఉన్నాం. మేము కూరగాయల షాపు పెట్టుకొని శ్రీకాకుళం నగరంలో జీవనం సాగిస్తున్నాం. మా కుమార్తె సుప్రియ శ్రీచైతన్య కళాశాలలో ఇంట ర్మీడియెట్ చదువుతోం ది. కుమారుడు ప్రశాంత్ 7వ తరగతి చదవుతుండగా, ఈ దుర్ఘటన జరిగింది. తాను పెద్దయ్యాక పోలీస్ అవుతానని ఇంట్లో అందరితో ప్రశాంత్ ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. ఇంట్లో ఏ పనిచేసినా, చేసు ్తన్నా ప్రశాంత్ జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి. ఈనెల 14కు ఏడాది అవుతుండడంతో నగరంలోని అనాథ శరణాలయంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచే శాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన రూ.12 లక్షలను పాప భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని బ్యాంకులో ఫిక్స్‌డ్ చేశాం.
 - బరాటం కామేశ్వరరావు, ఇందిర
 
 అమ్మ లేని జీవితం అంధకారం
 వంగర: అమ్మ లేని జీవితం అంతా అంధకారం ఉందని మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన లచ్చుభుక్త రాము, లచ్చుభుక్త వెంకటరావులు కన్నీరుమున్నీరవుతున్నారు. గత ఏడాది గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో తల్లి లచ్చుభుక్త పారమ్మ(65) మృతి చెందిన ఘటన ఇంకా మరువలేకపోతున్నామని వారు విలపిస్తున్నారు. ‘ఇంటి కష్టసుఖాలన్నీ మా అమ్మగారే చూసుకునేవారు, ఆమె మృతితో మేం ఇంటి పెద్దను కోల్పోయాం. ఆర్థిక సాయం అందింది. కానీ అమ్మ లేని లోటు ఎలా తీరుతుంది’ అని గద్గద స్వరంతో గతాన్ని వారు గుర్తు చేసుకున్నారు.   
 

>
మరిన్ని వార్తలు