గమ్యం చేరే దారేది..!

13 Jul, 2016 23:52 IST|Sakshi
గమ్యం చేరే దారేది..!

సిటీబస్సుకు ఎంఎంటీఎస్‌కు తెగిన లింకు
ప్రయాణికులకు తప్పని పాట్లు
దశాబ్దం దాటినా అమలుకు నోచని కనెక్టివిటీ

 
ఏళ్లుగా ఇదే నిర్లక్ష్యం..
గ్రేటర్ హైదరాబాద్‌లోని 26 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లలో మూడొంతుల స్టేషన్లది ఇదే దుస్థితి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, హైటెక్‌సిటీ వంటి కొన్ని స్టేషన్లు మినహా.. చాలా వరకు రోడ్డు సదుపాయం కానీ, సిటీ బస్సు కనెక్టివిటీ కానీ లేకుండానే ఉన్నాయి. నగరంలో ప్రజా రవాణా రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో 2003లో ప్రవేశపెట్టిన ఈ ‘మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ’ బస్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ‘సింగిల్ మోడల్ సిస్టమ్’గానే నడుస్తోంది. ఎంఎంటీఎస్‌తో పాటే అన్ని స్టేషన్లకు రోడ్లు, బస్‌స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించారు. కానీ 13 ఏళ్లు దాటినా అది ఆచరణకు నోచుకోలేదు. ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న కొన్ని స్టేషన్లకు మాత్రమే బస్సు సదుపాయం కల్పించారు. మొదట్లో కొద్ది రోజులు ఎంఎంటీఎస్ ట్రైన్ తరహాలోనే నీలి, తెలుపు రంగు బస్సులను నడిపారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ వంటి స్టేషన్లకు ఈ బస్సులు నడిచేవి. కానీ ప్రయాణికుల ఆదరణ లేదనే కారణంతో ఏడాది తిరగకుండానే బస్సులను నిలిపివేశారు. దీంతో ఎంఎంటీఎస్-సిటీ బస్సు కనెక్టివిటీ ఆదిలోనే అటకెక్కింది.
 
 
 
సిటీబ్యూరో:  నగరంలో ప్రతిరోజు ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసుల సంఖ్య 121. వీటిలో ప్రయాణిస్తున్న వారు 1.30 లక్షల మంది. మూడేళ్ల క్రితం 1.60 లక్షల మంది ఎంఎంటీఎస్ రైళ్లను వినియోగించుకునే వారు. ఈ మూడేళ్లలో 30 వేల మంది ఎంఎంటీఎస్‌కు దూరమయ్యారు. రూ. 10తో ట్రైన్‌లో ప్రయాణించిన వారు రైలు దిగి తమ గమ్యం చేరుకోవాలంటే ఆటోకు కనీసం రూ.30 చెల్లించాల్సిన పరిస్థితి. ఫలక్‌నుమా-లింగంపల్లి, నాంపల్లి-లింగంపలి,  సికింద్రాబాద్-నాంపల్లి మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. రైలు దిగి గమ్యం చేరేందుకు ఇప్పటికీ నగరంలోని ఏ ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి పూర్తిస్థాయిలో సిటీ బస్సు సౌకర్యం లేదు. దీంతో క్రమంగా ప్రయాణికుల సంఖ్య  తగ్గుతోంది. ఇదేక్రమంలో గ్రేటర్‌లో 3850 సిటీ బస్సులు
 
 
 
నడుస్తుండగా ఎంఎంటీఎస్ స్టేషన్లతో లింకున్నవి 300 మించి లేవు.  సీతాఫల్‌మండి బస్టాపు నుంచి ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ మధ్య దూరం 2 కిలోమీటర్లు. ఈ మార్గంలో బస్సులు రైల్వేస్టేషన్ వరకు వెళ్లే అవకాశం లేదు. రైల్వేస్టేషన్‌లో దిగి ఇటు తార్నాక వైపు లేదా అటు చిలకలగూడ వైపు నడిచి వెళ్లాల్సిందే. లేదంటే ఆటో ప్రయాణం. ఆటోలో రెండు కిలోమీటర్ల దూరానికి కనీసంరూ. 30 చెల్లించాలి. హైటెక్‌సిటీ నుంచి సీతాఫల్‌మండి వరకు ఎంఎంటీఎస్ ట్రైన్‌లో రూ.10 టిక్కెట్‌పై వచ్చిన వారు.. మరో రెండు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్లేందుకు ఆటోకు రూ.30 వెచ్చించాల్సి వస్తోంది.

అమీర్‌పేట్ నేచర్ క్యూర్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు వందలాది మంది రాకపోకలు సాగిస్తారు. కానీ ఈ రూట్‌లో బస్సులు అందుబాటులో ఉండవు. బసెక్కాలంటే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వైపు లేదా అమీర్‌పేట్ వైపు రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిందే.
 ఈ రెండు స్టేషన్లు మాత్రమే కాదు.. చందానగర్, హఫీజ్‌పేట్, బోరబండ, భరత్‌నగర్, నెక్లెస్‌రోడ్డు, బేగంపేట్, జేమ్స్ స్ట్రీట్, మలక్‌పేట్, యాకుత్‌పురా, తదితర స్టేషన్లకు సైతం బస్సు సదుపాయం లేదు. వేలాది మంది రాకపోకలు సాగించే మౌలాలీ, మల్కాజిగిరి వంటి రైల్వేస్టేషన్ల పరిస్థితీ అలాగే ఉంది. ఇంకా కొన్ని రైల్వేస్టేషన్లకు రోడ్డు సదుపాయం కూడా లేదు. దీంతో ప్రయాణికులు తక్కువ చార్జీలతో ఎంఎంటీఎస్ రైళ్లను  వినియోగించుకోగలిగినా ట్రైన్ దిగిన తరువాత రోడ్డు రవాణా కోసం ఇబ్బందులకు గురికావలసి వస్తోంది.
 
తగ్గుతున్న  ప్రయాణికులు..
పెరుగుతున్న జనాభా, రోడ్లపై వాహనాల రద్దీ, ప్రయాణికుల అవసరాలు, వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎంఎంటీఎస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో సుమారు రూ. 69.50 కోట్ల వ్యయంతో ఈ రైళ్లు పట్టాలెక్కాయి. మొదట సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు ఈ రైలును ప్రవేశపెట్టారు. తరువాత సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు విస్తరించారు. 25 వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్ సేవలు.. ప్రస్తుతం 121 సర్వీసులకు చేరుకున్నాయి. కానీ ఇప్పటికీ సిటీ బస్సుతో లింకు లేకపోవడంతో ఏటా ప్రయాణికుల సంఖ్య తగ్గుతోంది. 2013లో ఎంఎంటీఎస్ రైళ్లలో 1.60 లక్షల మంది పయనిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 1.30 లక్షలకు పడిపోయింది. అటు హైటెక్ సిటీ నుంచి ఇటు పాతనగరం వరకు సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు ఎంఎంటీఎస్ ఎంతో అందుబాటులో ఉన్నప్పటికీ క్రమంగా ఆదరణ కొరవడుతోంది. ఇక ఎంఎంటీఎస్ రెండో ద శ ప్రాజెక్టులోనైనా రోడ్డు, సిటీ బస్సు కనెక్టివిటీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకొంటే తప్ప నగర ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండదు.
 
 

>
మరిన్ని వార్తలు