కేజీ.. బుల్లెట్ బైకుల్లో రారాజు

17 Jul, 2014 00:41 IST|Sakshi
కేజీ.. బుల్లెట్ బైకుల్లో రారాజు

కేజీ.. బుల్లెట్ బైకుల్లో రారాజు అనే మాట ‘బుల్లెట్’కు సరిగ్గా సరిపోతుంది. రివాల్వర్ బుల్లెట్‌లా ఇది కూడా అంతే వేగంగా దూసుకుపోతుంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచే హల్‌చల్ చేసిన ఈ బుల్లెట్.. నేటి కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ఒకప్పుడు హుందాతనానికి, శరీర సౌష్టవానికి సింబల్‌గా నిలిచి.. ఇప్పుడు యూత్ ఫేవరెట్ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్ సంపాదించింది. దిగువ స్థాయి పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ వీటి హవా కొనసాగుతుంది. పెనుగొండ వంటి గ్రామంలో యువకులు నెల రోజుల్లో 15 వరకు బుల్లెట్లు కొనుగోలు చేసారంటే వీటికున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
 - పెనుగొండ రూరల్

 లేటెస్ట్ ఫ్యాషన్
 ట్రెండ్ మారుతోంది. దానికి తగ్గట్టుగానే యూత్ స్టైల్‌లో కూడా డిఫరెంట్ లుక్ వచ్చింది. రకరకాల ఫ్యాషన్లు.. రోజుకొక డిజైన్.. ఇవన్నీ ఎందుకు అనుకున్నారో ఏమో నేటి యువత పాతతరాన్నే రోల్ మోడల్‌గా తీసుకుంటోంది. బ్లాక్ అండ్ వైట్‌లో హీరోలు వాడిన కాస్ట్యూమ్స్ నుంచి కళ్లద్దాల వరకు అన్నింటినీ ఫాలో అవుతూ నలుగురి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ కోవకే చెందుతూ.. తాజాగా తెరపైకి వచ్చినవే బుల్లెట్లు. ఒకప్పుడు హుందాతనానికి, శరీర సౌష్టవానికి సింబల్‌గా భావిస్తూ ఉపయోగించిన బుల్లెట్లను నేడు ఫ్యాషన్ కోసం, కొత్తగా కనిపించడం కోసం వాడుతున్నారు. ఇక యూత్ ఆసక్తిని గమనించిన కంపెనీలు రకరకాల బుల్లెట్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి.
 
 ‘రాయల్’ లుక్
 ఇరవై ఏళ్ల కిందట ఎన్‌ఫీల్డ్ ఇండియా బుల్లెట్ వినియోగించే వారిలో రాజసం కనిపించేది. బండికి తగిన హుందాతనం, శరీర సౌష్టవంతో ఆకట్టుకునే వారు. బుల్లెట్ వాడేవారిని కోటీశ్వరుడిగా పరిగణించే వారు. కాలానుగుంగా పెట్రోల్ ధరలు పెరగడం, కార్ల ధరలు అందుబాటులోకి రావడంతో బుల్లెట్ల వినియోగం తగ్గింది. ఆ తరువాత కనుమరుగయ్యాయి. మళ్లీ ఇప్పుడు ఆధునిక హంగులతో వివిధ రకాల రంగులు, అనేక మోడళ్లతో వస్తూ నేటి యువతరం హృదయాల్లో స్థానం సంపాదించేశాయి. గ్రామీణ రోడ్లలోనూ హల్‌చల్ చేస్తున్నాయి.
 
 హుందాతనానికి  రాయల్ ఎన్‌ఫీల్డ్
 వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఎన్‌ఫీల్డ్ ఇండియా బుల్లెట్ల అమ్మకాలు మనదేశంలో 1949లో ప్రారంభమయ్యాయి. అప్పట్లో పోలీసులు, మిలటరీ వాళ్లు వీటని ఎక్కువుగా వినియోగించేవారు. 1994లో మద్రాసులో ఎన్‌ఫీల్డ్ ఇండియా, ఐషర్ కంపెనీలు విలీనమయ్యాయి. అప్పటి నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌గా రూపాంతరం చెందింది. ఇదే కాకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్విన్స్ పార్క్ 350, ట్విన్స్‌పార్క్ 500, ఎలక్ట్రా ట్విన్స్ పార్క్, క్లాసిక్ 350, క్లాసిక్ 500, క్లాసిక్ క్రోమ్, క్లాసిక్ డిసర్ట్‌స్ట్రోమ్, కాంటినెంటల్ జీటీ, తండర్ బార్డ్ 350, తండర్ బార్డ్ 500 వంటి పది రకాల మోడళ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటి ఎక్స్‌షోరూమ్ ధర రూ.96 వేల నుంచి రూ.1.85 లక్షల వరకు ఉంది.
 
 ఆధునికతతో అందంగా..
 350, 500 సీసీతో ఐదు గేర్లతో బుల్లెట్లు ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్నాయి. గతంలో బుల్లెట్‌కు కిక్‌స్టార్ ఉండేది. కిక్ కొట్టాలంటే కండలు తిరిగిన శరీర సౌష్టవం కావాలని భావించేవారు. ప్రస్తుతం సెల్ఫ్‌స్టార్ సిస్టంతో అందుబాటులోకి వచ్చాయి. 40 కిలోమీటర్లకు పైగా మైలేజీ కూడా ఇస్తుండటంతో దీని క్రేజ్ పెరిగింది.

మరిన్ని వార్తలు