నంద్యాలలో చిరుత సంచారం

3 May, 2019 12:05 IST|Sakshi
చిరుత అడుగు జాడలు

భయాందోళనలో ప్రజలు

బొమ్మలసత్రం: నంద్యాల పట్టణం ఎస్సార్బీసీ కాలనీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జంతువు ఏదో సంచరిస్తుండగా అక్కడే పనిచేసే ముగ్గురు సెక్యూరిటీ గార్డ్‌లు టార్చ్‌లైట్‌ వేసి చూశారు. చిరుతపులి అని గ్రహించి భయంతో వెంటనే   స్థానికులకు సమాచారం అందించారు. దాదాపు అరగంట పాటు పక్కనే ఉన్న పొలాల్లో చిరుత సంచరించింది. స్థానికులు అక్కడికి చేరుకోగానే పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. సెక్యూరిటీ సిబ్బంది ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించటంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. ఉదయం 7 గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. చిరుత అడుగు జాడలను  గమనించినట్లు డీఎఫ్‌వో శివశంకర్‌ రెడ్డి తెలిపారు. రాత్రిళ్లు సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టి ఎలాగైనా చిరుతను పట్టుకుంటామని స్పష్టం చేశారు.  

భయంతో పరుగులు తీశాం
తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఏదో జంతువు మేము ఉన్న చోటికి రావటం గమనించాం. అనుమానంతో టార్చ్‌లైట్‌ వేసిచూస్తే చిరుతపులి కనిపించింది. గట్టిగా గాండ్రించటంతో భయంతో కాలనీలోకి పరుగులు తీశాం. స్థానికులకు పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందించాం.   –ప్రకాశ్, సెక్యూరిటీ సిబ్బంది  

మరిన్ని వార్తలు