జనవరి 9, 10 తేదీల్లో ‘స్థానిక’ ఎన్నికల షెడ్యూల్‌?

21 Dec, 2019 05:21 IST|Sakshi

మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీవి జరిగే అవకాశం

వెనువెంటనే పంచాయతీలకు..

15 రోజుల వ్యవధిలో మొత్తం ప్రక్రియ పూర్తి

బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ ప్రక్రియ వేగవంతం

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలును వచ్చే జనవరి 9 లేదా 10 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వర్గాలు తెలిపాయి. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. గరిష్టంగా 15 రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం.. ఆయా పదవుల పదవీకాలం పూర్తయ్యేలోపు ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, 2018 ఆగస్టులో సర్పంచ్‌ల పదవీకాలం, ఈ ఏడాది జూన్‌లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల పదవీకాలం ముగిసినప్పటికీ గత తెలుగుదేశం ప్రభుత్వం వీటికి సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేయకుండా కాలయాపన చేసింది. దీంతో ఎన్నికలు సకాలంలో జరగలేదు. మరోవైపు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో.. పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలంటూ ఇటీవల హైకోర్టు ఆదేశించింది.

ఒకట్రెండు రోజుల్లో బ్యాలెట్‌ ముద్రణ టెండర్లు
రాష్ట్రంలో జనవరి 10 తర్వాత స్థానిక ఎన్నికల నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. జిల్లాల వారీగా బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, సామగ్రి కొనుగోలుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ త్వరలో ఖరారయ్యే అవకాశం ఉంది.

ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతమున్న 13,065 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 1.30 లక్షల వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించాలి. వీటిని మూడు, నాలుగు దశల్లో నిర్వహించాల్సి ఉంటుంది. అదే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలైతే ఒకటి లేదా రెండు విడతల్లో పూర్తయ్యే అవకాశముంది. దీంతో త్వరగా ఎన్నికల ప్రక్రియ ముగిసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ముందుగా నిర్వహిస్తే బాగుంటుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే  పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఆ గుర్తులతో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు చెబుతున్నారు. అవి ముగియగానే పది పదిహేను రోజుల వ్యవధిలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభించాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు