‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు

28 Dec, 2019 04:18 IST|Sakshi

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85 శాతం రిజర్వేషన్లు

2011 జనాభా ఆధారంగా ఎన్నికల నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం

వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలు

పసుపు, మిర్చి, చిరుధాన్యాల సాగుకు ముందే మద్దతు ధరలు

కొత్త అంబులెన్స్‌ల కొనుగోలుకు నిధులు

మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఎస్పీవీ ఏర్పాటుకు అనుమతి

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను 2011 జనాభా లెక్కల ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అత్యంత కీలకమైన రిజర్వేషన్లను సైతం ఖరారు చేసింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం వీటితోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనమే లక్ష్యంగా సర్కారు పని చేస్తుందని చెప్పారు. మంత్రి నాని వివరించిన మంత్రివర్గ నిర్ణయాలు ఇలా..

►2011 జనాభా గణన ఆధారంగా బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08, ఎస్టీలకు 6.77 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్ల దామాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ చట్టం– 1994 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ.
►ప్రమాదాల్లో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి చేరవేసి, మెరుగైన వైద్యం అందించడం ద్వారా ప్రాణాలు కాపాడాలనే ఉన్నతాశయంతో నాడు దేశంలో ప్రప్రథమంగా దివంగత సీఎం వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్‌ సేవలు గత అయిదేళ్లలో దారుణంగా తయారయ్యాయి. నిర్వహణ బాగోలేక వాహనాలకు కాలం చెల్లింది. జీతాల్లేక డ్రైవర్లు సమ్మెలోకి వెళ్లడం వల్ల గత అయిదేళ్లలో ఎందరో చనిపోయారు. ఈ నేపథ్యంలో 412 సరికొత్త 108 సర్వీసు వాహనాలను వచ్చే ఏడాది మార్చి ఆఖరులోగా రూ.71.48 కోట్లతో కొనుగోలు చేయాలి.
►ఆరోగ్య పరీక్షలు నిర్వహించే 104 సర్వీసుల కోసం 656 వాహనాలను రవాణా వ్యయంతో కలిపి మొత్తం రూ.60.51 కోట్లతో మార్చి ఆఖరులోగా కొనుగోలు చేయాలి.
►కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీకి కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో 6.04 ఎకరాలు కేటాయింపు. మార్కెట్‌ విలువ ఎకరా రూ.43 లక్షలు ఉన్నప్పటికీ ఎకరా రూ.లక్షకే కేటాయించాలని నిర్ణయం. వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో 4 ఎకరాలను రాష్ట్ర వక్ఫ్‌ బోర్డుకు బదలాయించేందుకు ఆమోదం.
►మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ రైట్స్‌ నిర్మాణ సంస్థకు అప్పగిస్తూ ఇన్‌క్యాబ్‌ సీఎండీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మించడం కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్పీవీ) ఏర్పాటుకు అనుమతి.
►రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న కృష్ణపట్నం సముద్ర ముఖపరిధిని కుదించాలని నిర్ణయం.

వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు కొత్త పాలసీ
రాష్ట్రంలో 191 మార్కెట్‌ యార్డులు, 150 ఉప మార్కెట్‌ యార్డులు.. మొత్తం 341 చోట్ల వ్యవసాయ ఉత్పత్తుల శాశ్వత కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేవలం కోతల సమయంలోనో, వ్యవసాయ ఉత్పత్తులు చేతికొచ్చే సమయంలోనే కాకుండా 365 రోజులూ ఇవి పనిచేసేలా నూతన విధానం అమలవుతుంది. పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్య (కొర్ర, అండుకొర్ర, అరిక, వరిగ, ఊద, సామలు) పంటలకు నేటికీ కనీస మద్దతు ధర కరువైన తరుణంలో ఏటా సాగు సీజన్‌కు ముందే వీటికి కనీస మద్దతు ధరలను ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఈ ఏడాది క్వింటాలు మిర్చికి రూ.7 వేలు, పసుపు రూ.6,350, ఉల్లి (కనీసం) రూ.780, చిరుధాన్యాలకు రూ.2,500గా కనీస మద్దతు ధర ఖరారు చేసింది. టమాటా, చీని, అరటి, నిమ్మ పంటలకు మద్దతు ధర ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటన్నింటికీ విధి విధానాలు ఖరారు చేయాలంటూ వ్యవసాయ మార్కెట్‌ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

>
మరిన్ని వార్తలు