ప్రేమ పేరుతో వేధింపులు..బాలిక ఆత్మహత్య

18 Aug, 2013 02:24 IST|Sakshi
కోహీర్, న్యూస్‌లైన్ : ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు మండలంలోని మద్రి గ్రామానికి చెందిన నడిమిదొడ్డి అడివయ్య, పూలమ్మ దంపతుల కుమార్తె మమత గురుజువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే అదే గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ ఏడాది కాలంలో మమతను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని మమత తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు మమతను చదువు మానిపించారు. అయితే మమత ఎక్కడికి పోయినా వెంటబడి మరీ వేధించేవాడు ప్రవీణ్. దీంతో విషయాన్ని మమత తల్లిదండ్రులు గ్రామస్థులకు చెప్పి పంచాయతీ పెట్టించారు. అయినా ప్రవీణ్‌లో మార్పు రాలేదు.
 
 దీంతో ప్రవీణ్ ఆగడాలకు తీవ్ర మనస్తాపానికి గురై మమత శుక్రవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పక్కింటివారు విషయాన్ని తల్లిదండ్రులు చెప్పడంతో వారు ఇంటికి చేరుకుని విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం కోహీర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రవీణ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు. అడివయ్య, పూలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా మమత ఆఖరుది. పెద్ద కుమార్తెకు వివాహం అయ్యింది. ఇద్దరు కుమారులూ పెద్దగా చదువుకోలేదు.
 
 చెల్లిని బాగా చదివించాలనుకున్నాం
 చెల్లిని బాగా చదివించాలనుకున్నాం. అంతలోనే ప్రవీణ్ వేధింపు మొదలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువుపోతుందని భయపడ్డాం. అంతలోనే ఇలా జరుగుతోందని ఊహించలేదు.
 - రాజు, మమత సోదరుడు
మరిన్ని వార్తలు