బలపడుతున్న అల్పపీడనం

22 Jul, 2013 10:21 IST|Sakshi
బలపడుతున్న అల్పపీడనం

వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో మళ్లీ ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ఇది వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల వచ్చే 48 గంటల్లో కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
 

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కూడా వచ్చే 48 ఈ ప్రభావంవల్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమతో పాటు మిగిలిన కోస్తా, తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగుపాట్లతోపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. సముద్రతీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
 

మరోవైపు భారీ వర్షాలు, వరదల బారిన పడిన వందలాది గ్రామాలు మూడు రోజులు దాటినా జలదిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ముంచెత్తిన వరద తోడు కరెంటు సరఫరా లేకపోవడంతో లోతట్టు గ్రామాల ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. వరదల వల్ల సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధితులు చలికి తట్టుకోలేక, తిండి లేక అల్లాడుతున్నారు.

>
మరిన్ని వార్తలు