బెంబేలెత్తించిన టోర్నడో 

7 Dec, 2023 02:11 IST|Sakshi

మిచాంగ్‌ తుపాను వేళ గోదావరి జిల్లాల్లో విరుచుకుపడిన సుడిగాలులు 

వాతావరణంలో అసాధారణ మార్పులతో పీడనంలో కదలికలు 

ట్రాక్టర్లు, వరి కోత మెషి, ఇతర వాహనాలను ఎత్తిపడేసిన సుడిగాలి 

విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు, కొబ్బరి చెట్లు  

అమెరికాలో వస్తుంటాయని వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదంటున్న ప్రజలు 

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోలు 

తుపాను భూమికి సమీపంలో తీరం దాటడమే కారణమంటున్న నిపుణులు

సాక్షి, భీమవరం/ఆకివీడు: మిచాంగ్‌ తుపాను తీరం దాటే సమయంలో సముద్ర తీరంపైకి దూసుకొచ్చిన టోర్నడో (సుడిగాలులు) సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో టోర్నడో ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని తీరప్రాంత సమీప గ్రామాలపై విరుచుకుపడి బీభత్సం సృష్టించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. టోర్నడోలు అమెరికాను వణికిస్తుంటాయని వినడమే తప్ప..  మన ప్రాంతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు.

వాహనాలను సైతం ఎగరేశాయి 
పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో మంగళవారం రాత్రి టోర్నడో బీభత్సం సష్టిం­చింది. ట్రాక్టర్లు, వరి కోత మెషిన్లు, ఇతర వాహనాలు సుడిగాలుల్లో చిక్కుకుని పైకి ఎగిరి కొంతసేపటికి నేలపై పడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, వీరవాసరం, పాలకొల్లు, ఆచంట, ఆకివీడు మండలాల్లో టోర్నడో బీభత్సం సృష్టించి భారీగా ఆస్తి నష్టం కలగజేసింది. దాని ధాటికి నరసాపురం మండలం లిఖితపూడి, సరిపల్లి, మల్లవరంలంక గ్రామాల్లో 20 వరకు విద్యుత్‌ స్తంభాలు పడిపోగా.. 200కు పైగా కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి.

రోడ్ల వెంబడి చెట్లు నేలకొరిగాయి. వీరవాసరం, అదే మండలంలోని వడ్డిగూడెం, తోలేరు గ్రామాల్లో 40 విద్యుత్‌ స్తంభాలు, 250 వరకు కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. 40 ఎకరాల్లో అరటి పంట ధ్వంసమైంది. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల, పరిసర గ్రామాల్లో 200 కొబ్బరి చెట్లు, 41 విద్యుత్‌ స్తంభాలు, 4 ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. ఆచంట మండలం పెదమల్లం, సిద్ధాంతం గ్రామాల మధ్య ఏర్పడిన టోర్నడో వృక్షాలను నేలకూల్చింది. ఆకివీడు మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు సైతం పక్కకు పడిపోయాయి.

కాగా.. కాకినాడ జిల్లాలోనూ టోర్నడో బీభత్సం సృష్టించింది. గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారి పక్కన పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా సుడిగాలి ధాటికి హైవేపై వెళ్తున్న ఆటోలు గాలిలో ఎగిరాయి. సుడిగాలి రావడంతో బంక్‌లోని ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అన్నవరం రైల్వే గేటు సమీపంలో ఆగివున్న వాహనాలు ఎగిరిపడ్డాయి. ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. గేటుపక్కనే ఉన్న ఓ ఇంటి రేకులు ఎగిరిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి.

అన్నవరం క్షేత్రంలోనూ సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఘాట్‌రోడ్‌లో వృక్షాలు నేల కూలాయి. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వై.జంక్షన్, వీఎల్‌ పురం, మోరంపూడి, హుకుంపేట, ప్రకాశం నగర్, దానవాయిపేట, ఆర్ట్స్‌ కళాశాల పరిసరాల్లో టోర్నడో కలకలం సృష్టించింది. నివాసాలు, దుకాణాలపై రేకులు గాల్లోకి ఎగిరాయి. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.  

పీడన వ్యత్యాసమే కారణం 
తుపాను భూమికి చేరువగా తీరం దాటడం వల్ల టోర్నడో ఏర్పడేందుకు కారణమైందని నిపుణులు అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తీరప్రాంతం వెంబడి పెద్దఎత్తున ఆక్వా చెరువుల విస్తరించి ఉన్నాయి. సాధారణంగా నీరు, నేల ఉన్న ప్రదేశాల్లో ఉష్ట వ్యత్యాసాల వల్ల పీడన వ్యత్యాసం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. వాతావరణంలో అసాధారణ మార్పులు ఏర్పడినప్పుడు గాలి పొరలు విరూపణం (షియర్‌) చెంది పీడనంలో కదలికలు వచ్చి సుడులు (ఎడ్డీ ఫ్లో) ఏర్పడుతుంటా­యి.

ఇవి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి. చుట్టుపక్కల పీడన పరిస్థితులను బట్టి 150 కిలోమీటర్లు వేగంతోనూ కదులుతుంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. మిచాంగ్‌ తుపాను భూమికి చేరువగా తీరం దాటడం, తీరం వెంబడి ఉన్న అనుకూల పరిస్థితులతో టోర్నడో (సుడిగాలులు) ఏర్పడ్డాయని చెబుతున్నారు.

వాతావరణంలో అసాధారణ మార్పులతో..  
సముద్ర తీర ప్రాంతానికి ఆనుకొని తుపాను పయనించి తీరం దాట­డంతో వాతావరణంలో అసాధారణ మార్పులు తలెత్తి టోర్నడోలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో గాలుల వేగం గంటకు 90 నుంచి 110 కిలోమీటర్లు వరకు ఉంది. గతంలో కొల్లేరు సరస్సులో సుడిగాలులు వచ్చాయి.  – డాక్టర్‌ పి.రఘురామ్,  అసోసియేట్‌ ప్రొఫెసర్, ఎస్‌ఆర్‌కేఆర్‌  ఇంజినీరింగ్‌ కళాశాల, భీమవరం

>
మరిన్ని వార్తలు