వేతనం కోసం..వేదన

5 Jul, 2019 09:39 IST|Sakshi
వీరవాసరం మండలం కొణితివాడ నర్సరీలో పనిచేస్తున్న సిబ్బంది  

భీమవరం(పశ్చిమగోదావరి) : ఆటవీ శాఖ విభాగంలో నడిచే నర్సరీల్లో పనిచేస్తున్న వన సేవకులు, ఇతర సిబ్బందికి 8 నెలలుగా వేతనాలు రాక  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటవీ శాఖ విభాగంలో పనిచేసే ఈనర్సరీలకు ఉపాధి హామీ పథకం నిధులు వినియోగిస్తారు. ఆ నిధుల ద్వారా సిబ్బంది వేతనాలు, నర్సరీ అభివృద్ధి పనులు నిర్వహిస్తారు. అయితే ఈవిభాగానికి ఉపాధి హామీ పథకం నిధులు రాక  గత 8 నెలలుగా వనసేవకులకు వేతనాలు అందడం లేదు. 

పట్టించుకోని గత ప్రభుత్వం
కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వీరిని గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా వన సేవకులు జీతాలు రాక అప్పులు చేసుకుని బతకాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి వన సేవకుడికి సుమారు నెలకి రూ.8,800 వేతనం ఇస్తున్నారు. ఒక్కొక్కరికి సుమారు రూ.70 వేల వరకు వేతన బకాయిలు అందాల్సి ఉంది.
జిల్లాలో నర్సాపురం డివిజన్‌లో వీరవాసరం మండలం కొణితివాడ, నర్సాపురం మండలం సీతరామాపురం, రుస్తుంబాదు, యర్రంశెట్టివారి పాలెం,పెరవలి మండలంలోని కాకరపర్రు, మొగల్తూరు మండలంలంలో కేపీ పాలెంలో మొత్తం 7 నర్సరీలు  ఉన్నాయి వాటిలో మొత్తం 10 మంది వరకు వన సేవకులు ఇతర సిబ్బంది ఉన్నారు.

మట్టి పనులు చేసినవారికి అందని బిల్లులు
ఈనర్సరీల్లోని మొక్కల అభివృద్ధి కోసం ఎర్రమట్టి తీసుకువచ్చి వాటిలో ఈమొక్కలు ఉంచి సంరక్షణ చేస్తారు. మట్టితోలకం పనులు కాంట్రాక్టర్లు చేశారు. వారికి బిల్లులు చెల్లించలేదు. ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేస్తే వారికి బిల్లులు వస్తాయి.  గత ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను ఇతర పనులకు వినియోగించుకోవడంతో వీరంతా నానా పాట్లు పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వనసేవకులు కోరుతున్నారు.

జిల్లాలో 40 నర్సరీలు
జిల్లాలో∙40 నర్సరీలు ఉన్నాయి. వీటిలో 40 మంది వన సేవకులతో పాటు ఉపాధి కూలీలుగా పనిచేసిన సిబ్బంది నర్సరీకి 5 నుంచి 8 మంది చొప్పున ఉన్నారు. వీరికి ఉపాధి కూలీలకు ఇచ్చే విధంగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. 

8 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు
వన సేవకులుగా పనిచేస్తున్న మాకు 8 నెలలుగా జీతాలు రావడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. విధులకు రావడానికి ఇబ్బందులు పడుతున్నాం. ఎనిమిది నెలల వేతనాలు ఇవ్వకపోతే ఏమి తిని బతకాలి. ఉన్నతాధికారులు పట్టించుకుని మాకు వెంటనే జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– డి.వెంకటేశ్వరరావు, వన సేవకుడు, కొణితివాడ నర్సరీ

నిధులు విడుదల కావాల్సి ఉంది
నర్సరీల్లో పనిచేసే సిబ్బందికి, నర్సరీల అభివృద్ధి పనులకు ఉపాధి హామీ పథకం నిధుల  ద్వారా చెల్లింపులు చేస్తారు. ప్రతి నెల సిబ్బందికి ఇవ్వాల్సిన వేతనాలు మేము జనరేట్‌ చేస్తాము. 
నిధులు విడుదలయిన వెంటనే వారి ఖాతాకు జమవుతాయి. నిధులు విడుదలయిన వెంటనే వేతనాలు జమవుతాయి.
–  కె.శ్రీనివాసరావు, అటవీశాఖాధికారి, ఏలూరు

మరిన్ని వార్తలు