‘మధ్యాహ్న భోజనాన్ని’ ఇస్కాన్‌కు ఇవ్వొద్దు

24 Feb, 2015 03:28 IST|Sakshi
‘మధ్యాహ్న భోజనాన్ని’ ఇస్కాన్‌కు ఇవ్వొద్దు

కర్నూలు(జిల్లా పరిషత్): ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థకు అప్పగించాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి హెచ్చరించారు. ఇస్కాన్ సంస్థకు మధ్యాహ్న బోజన పథకం బాధ్యతను అప్పగించొద్దంటూ ఆ పథకం వర్కర్స్ యూనియన్( ఏఐటీయుసి) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వంట ఏజెన్సీలు, వంట చేసే మహిళలు పెద్ద ఎత్తున కర్నూలు తరలివచ్చారు. అంబేద్కర్ భవన్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం  జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు వినతి పత్రం అందజేశారు.
     
పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి, జిల్లా అధ్యక్షులు పి. మురళీధర్ మాట్లాడుతూ  ఒకవైపు బిల్లులు రాకున్నా,  అప్పులు చేసి పథకాన్ని కొనసాగిస్తుంటే మరోవైపు ఇస్కాన్‌కు పథకాన్ని అప్పగించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఆ సంస్థకు ఇస్తే విద్యార్థులకు గుడ్డు ఇవ్వరని, మత విశ్వాసాలను విద్యార్థులకు నూరిపోస్తారని ఆరోపించారు. ఈ సంస్థకు వ్యతిరేకంగా కమిషన్ నివేదిక ఇచ్చినా ప్రభుత్వం వారికే పథకం బాధ్యతలు ఇవ్వాలని చూడటం దారుణమన్నారు.
     
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్. మనోహర్‌మాణిక్యం, జిల్లా అధ్యక్షులు సుంకయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్. మునెప్ప మాట్లాడుతూ ప్రొఫెసర్ ఉమాదేవి నివేదిక ప్రకారం మధ్యాహ్న బోజన పథకంలో ఇస్కాన్ సంస్థ అవకతవకలకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేసిందన్నారు. ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నా పథకాన్ని కొనసాగిస్తున్న వారిని కాదని ఇస్కాన్‌కు అప్పగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు.     ధర్నాకు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోజెస్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు శేషఫణి, డీటీఎఫ్ జిల్లా ప్రదాన కార్యదర్శి కాంతారావు, ఎయిడెడ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు విక్టర్ ఇమ్మానియేల్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జి. రంగన్న, మహిళా సమాఖ్య నాయకులు గిడ్డమ్మ, కోటమ్మ మద్దతు తెలిపారు.
     
కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, శివ, నగర కార్యదర్శి పి. రామకృష్ణారెడ్డి, వెంకటేష్, ఈశ్వర్, పథకం వర్కర్స్ యూనియన్ నాయకులు బాలకృష్ణ, రమేష్, విజయలక్ష్మి, రాజేశ్వరి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు