ప్రశ్నకు సంకెళ్లు!

14 Mar, 2017 19:26 IST|Sakshi
►  తల్లి లేని బిడ్డకు అన్యాయం జరిగిందని ప్రశ్నించడం నేరం..
► హంతకులను శిక్షించమని డిమాండ్‌ చేయడం పాపం..
► ఖాకీల కండకావరాన్ని ఎదిరించడం ద్రోహం..
► చిన్నారిని చిదిమేసినోళ్లను అరెస్టు చేయమనడం ఘోరం..
                  
అవును పోలీసుల తీరు జిల్లాలో అచ్చం ఇలాగే ఉంది.
13 ఏళ్ల బాలికను సొంత బావ లైంగిక దాడి చేసి చంపేస్తే
ప్రశ్నించకూడదట.! మాట్లాడకూడదట!!
ప్రశ్నించినోళ్లకు సంకెళ్లేశారు.. మాట్లాడినోళ్లకు నోటిసులిచ్చారు..
ప్రకాశం ఖాకీల ద్వంద్వ నీతిని ఎవరు ప్రశ్నించినా ఇంతేనేమో?
పేర్నమిట్టపై అర్ధరాత్రి పోలీసుల దాడి తొమ్మిది మంది యువకుల బలవంతంగా అరెస్టు 41 మందికి నోటీసులిచ్చి వదిలేసిన పోలీసులు అనూరాధ హంతకులను శిక్షించమన్న ఫలితం..
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్‌) :  
పేర్నమిట్టలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు మూకుమ్మడి దాడి చేశారు. సుమారు 60 మంది పోలీసులు ఒక్కసారిగా ఇళ్లపై పడి 9 మంది యువకులను అరెస్టు చేసి వాహనాల్లో కుక్కి ఒంగోలు రూరల్‌ పోలీసుస్టేషన్‌కు తరలించుకెళ్లారు. అర్ధరాత్రి ఏమి జరుగుతుందో తెలియక పేర్నమిట్ట వాసులు ఆందోళనకు గురయ్యారు.
 
అనుమానాస్పదంగా మృతి చెందిన మాదాసు అనూరాధ కేసు ఘటన ముందు రోజు పేర్నమిట్టలోని కర్నూలు రోడ్డుపై జరిగిన రాస్తారోకోలో పాల్గొన్న వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారని ఆలస్యంగా తెలిసింది. ఒంగోలు రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. అనూరాధ కేసులో ఆందోళన చేసిన మొత్తం 9 మందిని అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అరెస్టయిన వారిలో రావూరి సుబ్బయ్య, కందుకూరి శ్రీనివాసరావు, కైలా వెంకట్రావు, పిడుగు రామకృష్ణారెడ్డి, కంభం బ్రహ్మయ్య, దాసరి కల్యాణ సుందరం అలియాస్‌ చినబాబు, జ్యేష్ట వెంకటేశ్వర్లు, అన్ను వెంకట సుబ్బారావు ఉన్నారు. వీరి అరెస్టులను నిరసిస్తూ  సోమవారం ఉదయం పేర్నమిట్ట వాసులు దాదాపు 200 మంది కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారన్న నెపంతో 41 మందికి నోటీస్‌లిచ్చారు. 
మరిన్ని వార్తలు