మన జెండా మననేత...

1 Aug, 2014 02:56 IST|Sakshi
మన జెండా మననేత...
  • రేపు పింగళి వెంకయ్య జయంతి
  • పింగళి వెంకయ్య 136వ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆయన స్వగ్రామం భట్లపెనుమర్రులో ఏర్పాట్లు చేస్తున్నారు. స్మారక భవన నిర్మాణ కమిటీ, పాలకమండలి, గ్రామస్తులతోపాటు గ్రామ సర్పంచి ఈ ఏర్పాట్లు చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, జిల్లా సీఈవో దాసరి సుదర్శనం అతిథులుగా వస్తారని సర్పంచి కొడాలి దయూకర్ విలేకరులకు తెలిపారు.
     
    భరతజాతి ఔన్నత్యానికి, కీర్తి ప్రతిష్టలకు ప్రతీక మువ్వన్నెల జెండా. భారతమాతకు కృష్ణాజిల్లా నుంచి పంపిన పుట్టింటి పట్టుచీర. ప్రపంచమంతా చెయ్యెత్తి జై కొట్టే ఈ త్రివర్ణ పతాకాన్ని చూడచక్కగా తీర్చిదిద్ది కృష్ణాజిల్లా ఖ్యాతిని నలుదిశలా ఎగురవేసిన మహనీయుడు పింగళి వెంకయ్య. పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ మండలం భట్లపెనుమర్రులో 1878, ఆగస్టు రెండో తేదీన జన్మించారు. ఇక్కడి ఎలిమెంటరీ పాఠశాలలో చదివిన ఆయన 1916 నుంచి 1922 వరకు పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఉద్యమాల్లో లాఠీదెబ్బలు తిని, జైళ్లలో మగ్గారు.

    1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో విజయవాడలోని గాంధీనగర్‌లో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారు. ఆ సమావేశంలో పాల్గొన్న మహాత్మాగాంధీ పింగళిని పిలిచి జాతీయ జెండా రూపొందించాలని కోరారు. ఆ వెనువెంటనే మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాల అధ్యాపకుడు ఈరంకి వెంకటశాస్త్రి తోడ్పాటుతో పింగళి కేవలం మూడు గంటల వ్యవధిలో త్రివర్ణ పతాకాన్ని తయారుచేశారు.

    పతాకం మధ్యలో రాట్నం ఉంటే బాగుంటుందని గాంధీజీకి చెప్పి ఒప్పించిన ఘనత ఆయనదే. దీనిపై 1921 ఏప్రిల్ 13న ‘యంగ్ ఇండియా’ పత్రికలో ఆయనకు ప్రశంసలు కూడా లభించారుు. 1931లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఏర్పాటుచేసిన ఉపసంఘం కూడా వెంకయ్య రూపొందించిన జెండానే ఖరారు చేయడం విశేషం. 1947 జులై 22న జెండాకు మధ్యలో రాట్నానికి బదులు అశోకచక్రం చేర్చి జాతీయ పతాకంగా భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.

    జాతీయ పతాకం నిర్మించిన తర్వాత పింగళి వెంకయ్య 1922లో రాజకీయాల నుంచి వైదొలిగారు. స్వాతంత్య్రానంతరం  ఆయనను ప్రభుత్వం ఖనిజ సలహాదారుడిగా నియమించింది. 1950లో దానిని రద్దుచేశారు. జీవిత చివరి దశలో దుర్భర జీవితాన్ని అనుభవించిన పింగళి 1963 జులై 4న కన్నుమూశారు. ఇంతటి ఘనచరిత్ర కలిగిన పింగళి స్మారకార్థం భట్లపెనుమర్రులో ఆయన పేరున ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. కూచిపూడి నుంచి పెడసనగల్లు మీదుగా భట్లపెనుమర్రు వెళ్లే రహదారికి పింగళి నామకరణం చేశారు.
     
    - కూచిపూడి
     

మరిన్ని వార్తలు