ఇళ్లయినా ఇవ్వండి.. డబ్బులన్నా కట్టండి

15 Jul, 2019 10:23 IST|Sakshi

24వ వార్డు కౌన్సిలర్‌.. ఒక్కో ఇంటికి రూ.30 వేలు వసూలు

అడిగితే సమాధానం చెప్పడం లేదని లబ్ధిదారుల ఆరోపణ

ఎర్రచెరువులో ఆందోళనకు దిగిన నిర్వాసితులు

సాక్షి, మంగళగిరి: అప్పులు చేసి.. వడ్డీలకు తెచ్చి ఇళ్లు వస్తాయనే ఆశతో డీడీలు తీయడంతో పాటు కౌన్సిలర్లకు లంచాలు ఇచ్చామని, కాని గత టీడీపీ ప్రభుత్వ పాలకులు లంచాలు తీసుకుని లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకుండా అన్యాయం చేశారని పలువురు ఆరోపించారు. పట్టణంలోని రాజీవ్‌ గృహ కల్ప రోడ్డులోని ఎర్రచెరువులో నిర్మిస్తున్న నివాసాల వద్ద ఆదివారం లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో కౌన్సిలర్లు ఇళ్లకు ప్రభుత్వానికి డీడీలు కట్టించడంతో పాటు ఒక్కో ఇంటికి రూ.30 వేల నుంచి లక్ష, రెండు లక్షలు వసూలు చేశారని, కాని లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకుండానే పాలన ముగిసిందని మండిపడ్డారు. ఇప్పుడు కౌన్సిలర్లను డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతుంటే మాత్రం ప్రభుత్వం మారిందని, ప్రభుత్వానికి డీడీలు తీసిన డబ్బులు మాత్రం వస్తే తిరిగి వస్తాయని, మాకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టణంలోని 24వ వార్డుకు చెందిన టీడీపీ కౌన్సిలర్‌ ఒక్కో ఇంటికి రూ.30 వేలు తీసుకుందని, ఇప్పుడు అడుగుతుంటే ప్రభుత్వం మారింది కనుక మా చేతుల్లో ఏమి లేదంటున్నారని చెప్పారు. ప్రభుత్వానికి డీడీలు కట్టిన వారికి వస్తే ఇళ్లు వస్తాయని, లేదంటే లేదని, తీసుకున్న డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేమంటూ సమాధానం చెబుతున్నారని, ఇదెక్కడి న్యాయమంటూ లబ్ధిదారుడు సుబ్బారావు వాపోయాడు. అలాగే పలువురు లబ్ధిదారులు టీడీపీ కౌన్సిలర్లతో పాటు డబ్బులు వసూలు చేసిన కౌన్సిలర్లందరూ తీసుకున్న డబ్బులు అయినా తిరిగిఇవ్వాలని, లేదంటే ఇళ్లు కేటాయించాలంటూ డిమాండ్‌ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఘటనాస్థలానికి పట్టణ పోలీసులు చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. 

మరిన్ని వార్తలు