మంగన్న ఎన్‌కౌంటర్ బూటకం

8 Mar, 2014 02:20 IST|Sakshi

 ఇల్లెందు, న్యూస్‌లైన్: మావోయిస్టు నేత మంగన్న అనారోగ్యంతో బాధపడుతూ ముంగుడవలస కొండ ప్రాంతంలోని కుగ్రామంలో షెల్టర్ తీసుకుని వైద్యం పొందుతుండగా పట్టుకుని కాల్చి చంపి ఎన్‌కౌంటర్ అంటూ కట్టుకథలు అల్లుతున్నారని అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ ఆరోపించారు. మంగన్న అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఇల్లెందు మండలం మిట్టపల్లి వచ్చిన ఆమె మాట్లాడారు. మావోయిస్టు నేతల తలలకు ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు పోలీసులు ఆశపడి అత్యంత పాశవికంగా మారణహోమం ృష్టిస్తున్నారని అన్నారు.

ప్రజల జీవితాలు బాగు చేసేందుకు మంగన్న చిరు ప్రాయంలోనే ఉద్యమంలో చేరి తన మనసులోకి స్వార్ధమనే భావం రాకుండా ఉండేందుకు వివాహం కూడా చేసుకోలేదని అన్నారు. రాజకీయనేతలు రోజుకోపార్టీ మారుస్తూ మేనిఫెస్టోలను ఇష్టారాజ్యంగా మారుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, ఈ క్రమంలో ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా మావోయిస్టు ఉద్యమం పని చేస్తోందని ఆమె అన్నారు. మంగన్న ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించి అందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 ప్రజల హక్కుల కోసం పోరాడిన మంగన్న : ఇల్లెందు, ములుగు ఎమ్మెల్యేలు  ఊకె అబ్బయ్య, సీతక్క
 ప్రజల హక్కులను కాపాడేందుకు సుధీర్ఘ కాలం పాటు పోరాడి అశువులు బాసిన మంగన్న ఆశయం గొప్పదని ఇల్లెందు, ములుగు ఎమ్మెల్యేలు ఊకె అబ్బయ్య, సీతక్కలు అన్నారు. మంగన్న వృుతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడారు.
 
 మంగన్న లక్ష్యం మరవలేనిది: ఎస్వీ
 సుధీర్ఘ కాలం పాటు విప్లవోద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన మావోయిస్టు నేత మంగన్న లక్ష్యం మరువలేనిదని న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు అన్నారు. మంగన్న వృుతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి నూతన ప్రజాస్వామిక విప్లవమే మార్గమన్నారు.

 హింసించి హతమార్చారు :  మాజీ ఎమ్మెల్యే గుమ్మడి
 సీపీఐ ఎంఎల్‌లో దళ సభ్యుడిగా చేరిన మంగన్న అంచెలంచెలుగా ఎదిగి ప్రజల పక్షాన ముందుకు సాగుతున్న క్రమంలో పోలీసులు పట్టుకుని చిత్ర హింసలకు గురి చేశారని ఎన్డీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, వరంగల్ కార్యదర్శి చిన్న చంద్రన్నలు అన్నారు.  మంగన్న నేరం చేస్తే పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులు ఎలాంటి విచారణ లేకుండానే హతమార్చి ఎన్‌కౌంటర్ కట్టుకథలు అల్లినారని అన్నారు. రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌హంట్ పేరుతో పోలీసులను అడవుల్లోకి అధిక సంఖ్యలో తరలించి నరమేధాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.

 ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు సుగుణరావు, తుడుందెబ్బ నాయకులు వట్టం ఉపేందర్, వట్టం నారాయణ, ఈసం నర్సింమారావు, రమణాల లక్ష్మయ్య, జవ్వాజి లక్ష్మీనారాయణ, కొడెం వెంకటేశ్వర్లు, ఎస్‌కె సంథాని, న్యూడెమోక్రసీ (చంద్రన్న) నాయకులు గౌని ఐలయ్య, జడ సత్యనారాయణ, జె.సీతారామయ్య, ఎన్డీ (రాయలవర్గం) నాయకులు కిన్నెర నర్సయ్య, అజయ్, మోకాళ్ల కృష్ణ,నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు