యూపీలో మరో ఎన్‌కౌంటర్‌.. మహిళా కానిస్టేబుల్‌పై దాడిలో..

22 Sep, 2023 11:38 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో ఎన్‌కౌంటర్‌ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, యూపీలోని అయోధ్యలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. 

వివరాల ప్రకారం.. ఆగస్టు 30న అయోధ్య రైల్వే స్టేషన్‌లోని సరయు ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ముగ్గురు వ్యక్తుల దాడిలో సదరు మహిళా కానిస్టేబుల్‌ తలకు తీవ్రగాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. నిందితులు.. పదునైన ఆయుధంతో ఆమె ముఖంపై దాడిచేశారు. వారి దాడిలో ఆమె పుర్రె ఫ్రాక్చర్ అయింది. దీంతో, వెంటనే ఆమెను లక్నోలోని కేజీఎంసీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే, రైలులో సీటు విషయంలో నిందితులు, మహిళా కానిస్టేబుల్‌కు మధ్య రైలులో గొడవ జరిగినట్టు పోలీసులు తెలిపారు. గొడవ మరింత పెరగడంతో కానిస్టేబుల్‌పై నిందితులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఇక, రైలు అయోధ్యకు చేరుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, శుక్రవారం ఉదయం పోలీసులకు నిందితులు కనిపించడంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా నిందితులు వారి వద్ద ఉన్న తుపాలకులతో పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో, పోలీసులు కూడా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ప్రధాన నిందితుడు అనీస్‌ ఖాన్‌ మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన అజాద్ ఖాన్, విశ్వంభర్ దయాళ్‌గా గుర్తించారు. అనంతరం, వారిని ఆసుపత్రికి తరలించారు. కాల్పుల సందర్భంగా కలండర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు రతన్‌శర్మకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీనియర్ సూపరింటెండెంట్ రాజ్ కరణ్ నయ్యర్ మాట్లాడుతూ.. నిందితులు కాల్పుల జరపడంతోనే పోలీసులు ఫైరింగ్‌ చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే అనిస్‌ ఖాన్‌ మృతిచెందినట్టు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ప్రెసిడెన్షియల్‌ సూట్‌ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు!

మరిన్ని వార్తలు