ముద్రగడకు పలువురి సంఘీభావం

5 Feb, 2016 03:16 IST|Sakshi
ముద్రగడకు పలువురి సంఘీభావం

జగ్గంపేట : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దంపతుల ఆమరణ దీక్షకు సర్వం సిద్ధమైంది. కాపులను బీసీల  జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్ తో ప్రాణాలను లెక్కచేయకుండా ఆరు పదుల వయస్సులో శుక్రవారం ఉదయం నుంచి ముద్రగడ ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా, రాష్ట్రంలోని పలువురి నేతలు ముద్రగడకు సంఘీభావం తెలుపుతున్నారు. గురువారం కిర్లంపూడిలో ముద్రగడను పలువురి నేతలు కలిసి మద్దతు తెలిపారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, కాపు సంఘం నేత వాసిరెడ్డి ఏసుదాసు, మిండగుదిటి మోహన్, ఆకుల రామకృష్ణ, సంగిశెట్టి అశోక్, జీవీ రమణ తదితరులు ముద్రగడను కలిసి మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.

నేడు పూజలు చేయండి
కాపులకు రిజర్వేషన్‌ను కల్పించాలని కోరుతూ సతీ సమేతంగా శుక్రవారం నుంచి ముద్రగడ పద్మనాభం చేపడుతున్న నిరాహార దీక్షకు మద్దతుగా  కాపులందరూ శుక్రవారం ఉదయం తలారా స్నానం చేసి విష్ణుమూర్తికి పూజలు చేయాలని కాపు సద్బావన సంఘ జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు విజ్ఞప్తి చేశారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  దీక్షకు మద్ధతుగా మధ్యాహ్నం భోజనం మాని ఎవరి ఇంటి వద్ద వారు ఖాళీ పళ్లానికి గరెటతో మోగించాలని కోరారు. ఆ శబ్ధం మన నాయకుడికి మద్దుతు తెలిపినట్టేనని అన్నారు. అలాగే కాపు సంఘం మరో నాయకుడు మిండగుదిటి మోహన్ మాట్లాడుతూ ముద్రగడకు హాని జరగకుండా  చూసుకోవాల్సిన బాధ్యత కాపులందరిపై ఐక్యంగా ఉందన్నారు. దీక్షకు  ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలియజేయాని కోరారు.

మరిన్ని వార్తలు