‘పుట్టగుంట’కు మావోయిస్టుల బెదిరింపు ఫోన్‌కాల్స్

25 Aug, 2014 02:38 IST|Sakshi
‘పుట్టగుంట’కు మావోయిస్టుల బెదిరింపు ఫోన్‌కాల్స్

హనుమాన్‌జంక్షన్ : హనుమాన్‌జంక్షన్‌కు చెందిన పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్‌కుమార్‌కు మావోయిస్టు పార్టీ నేతల పేరుతో బెదిరింపు ఫోన్‌కాల్స్ రావటం స్థానికంగా కలకలం సృష్టించింది. గత నాలుగు రోజులుగా వరుస ఫోన్‌కాల్స్ రావటంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు పార్టీ ఆగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి పార్టీకి ప్లీనరీ నిర్వహణకు నిధులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇప్పటి వరకు నాలుగైదు సార్లు ఫోన్‌కాల్స్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో కూడా  కాల్ వచ్చింది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై జంక్షన్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సతీష్ ఇల్లు, కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయనకు వచ్చిన ఫోన్ నంబరుపై నిఘా పెట్టారు.

నిజంగా మావోయిస్టులు చేస్తున్నారా? లేక వారి పేరుతో డబ్బు వసూలు కోసం ఇతరులెవరైనా యత్నిస్తున్నారా ? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే ఆ ఫోన్ నంబరుకు సంబంధించిన కాల్‌డేటాను పోలీసులు సేకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి ఆ వ్యక్తి ఫోన్ చేస్తున్నట్లుగా గుర్తించారు. వాస్తవానికి ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని శ్రీకాకుళం జిల్లా నుండి మాట్లాడుతున్నట్లు సదరు వ్యక్తి తొలుత పుట్టగుంటకు ఫోన్‌లో చెప్పాడు. కాల్‌డేటాను పరిశీలిస్తే వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి ఫోన్ చేసినట్లు వెల్లడైంది. ఏఎస్సై నేతృత్వంలో ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన బృందం వరంగల్ చేరుకుని అక్కడి పోలీసుల సహకారంతో విచారణ చేస్తోంది.
 
నకిలీ ఆధారాలతో బ్యాంకు ఖాతా..
 
పుట్టగుంట సతీష్‌కుమార్‌కు మావోయిస్టు నేత గణపతి పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి ఇచ్చిన బ్యాంకు ఖాతా వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్ సమీపంలోని ఐ.సి.ఐ.సి.ఐ బ్రాంచ్‌లో ఈ ఖాతా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖాతాకు సంబంధించి బ్యాంకు అధికారులకు ఇచ్చిన ఆడ్రస్సు, ఇతర ఆధారాలు సరైనవి కాకపోవటంతో పాటు నగదును కూడా పూర్తిగా ఏటీఎం ద్వారానే డ్రా చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఆ ఖాతాలోకి ఎప్పుడెప్పుడు, ఎవరి ఖాతాల లోంచి ఎంత మొత్తంలో నగదు జమ అయింది.. అనే సమాచారాన్ని బ్యాంకు అధికారుల నుంచి పోలీసులు సేకరిస్తున్నారు.
 
ఆగ్రనేతే ఫోన్ చేస్తాడా?
 
సాక్షాత్తూ మావోయిస్టు పార్టీ ఆగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పేరుతో బెదిరింపు ఫోన్‌కాల్స్ రావటంపై పోలీసుల్లో సైతం విస్మయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి రికార్డు చేసిన బెదిరింపు ఫోన్‌కాల్స్‌లోని వ్యక్తి మాటతీరును బట్టి అతడికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉండవచ్చని తెలిసింది. కానీ గణపతికి 60 ఏళ్లు పైబడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు