‘రాజమండ్రిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి కసరత్తు

14 Oct, 2019 14:22 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : కంబాల చెరువు ప్రాజెక్టు, ఇండోర్ స్టేడియం ఈ ఏడాదే పూర్తి చేస్తామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన ‘మీట్‌ ద ప్రెస్‌’లో ఎంపీ మాట్లాడుతూ.. రాజమండ్రిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాజమండ్రి అభివృద్ధికి విస్తృతంగా కృషి చేస్తున్నామన్నారు. ఇండోర్ స్టేడియం నిర్మాణానికి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని, గతంలో దీనికి నిధులు మంజూరు అయినా.. గత ప్రభుత్వం వేరే అకౌంట్‌కు నిధులు మళ్లించిందని దుయ్యబట్టారు. ఉడాన్‌ స్కీమ్లో భాగంగా రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి త్వరలో షిరిడి, తిరుపతి, విజయవాడకు విమానాలు తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ విషయంపై త్వరలో ఎయిర్పోర్టు అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామని ఎంపీ తెలిపారు.

అదే విధంగా దేవరపల్లి నుంచి గుండుగొలను వరకు అయిదు కిలోమీటర్ల మేర రోడ్డు దారుణంగా ఉందని, దీనిని మరమ్మతులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఎంపీ భరత్‌ వివరించారు. రోడ్డు మరమ్మతులకు దాదాపు రూ. 100 కోట్లు మంజూరయ్యాయని, రాజమండ్రి కంబాల చెరువు పార్కులో వినూత్నంగా ఈ ఏడాది సౌండ్ ప్రూఫ్ దివాళి ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. కంబాల చెరువు పార్కులో మల్టీకలర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని, రాజమండ్రి చరిత్రను తెలియజేప్పే విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కంబాల చెరువు ప్రాజెక్టు, రాజమండ్రిని హెరిటేజ్ టూరిజం ప్రాంతంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. హితకారిణి సమాజం కళాశాలలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఎంపీ మార్గాని భరత్‌ పేర్కొన్నారు. గోదావరిలో వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక మిషన్ను తీసుకు వస్తున్నామని... రెండు మూడు నెలల్లోనే జిల్లాకు వస్తుందని తెలిపారు.

  

మరిన్ని వార్తలు