నిన్న పత్తి.. నేడు కందులు..

20 Jan, 2014 04:14 IST|Sakshi

ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ :  ప్రభుత్వ రంగ సంస్థలు సీసీఐ, మార్క్‌ఫెడ్ అలసత్వం రైతులకు శాపంగా మారుతోంది. సకాలంలో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో పత్తి, కందులకు ధర పలకడం లేదు. ప్రైవేటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తక్కువ ధరకే పత్తి, కందులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది.

ఇప్పటికే 80 శాతం వరకు రైతులు పత్తి విక్రయించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తాపీగా గిట్టుబాటు ధర చెల్లిస్తామంటూ రంగంలోకి దిగింది. ధర పెరగడంతో బడా వ్యాపారులకే లాభం చేకూరింది. కందుల కొనుగోళ్లలోనూ మార్క్‌ఫెడ్‌దీ అదే తీరు కనిపిస్తోంది. జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, సిర్పూర్ డివిజన్లలో 90,238 ఎకరాల్లో కంది సాగైంది. ఎకరానికి నాలుగు క్వింటాళ్ల లెక్కన 3.60లక్షల క్వింటాళ్లు దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.

వర్షాలు, పూత దశలో వాతావరణంలో మార్పు, తుపాన్, కాత దశలో ఎండు తెగులు కారణంగా దిగుబడి తగ్గింది. ఎకరానికి మూడు క్వింటాళ్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 17మార్కెట్ యార్డుల్లో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉన్నా ఎక్కడా ప్రారంభం కాలేదు. దీంతో రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించి మద్దతు ధర లభించక నష్టపోతున్నారు.

ప్రభుత్వం ఇప్పటికే కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,300గా ప్రకటించింది. ప్రైవేటు వ్యాపారులు వారం రోజుల క్రితం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.4,150 చెల్లించి కొనుగోలు ప్రారంభించారు. శనివారం వరకు రూ.3,550 నుంచి రూ.3,850 వరకు ధర చెల్లించారు.   

 మార్కెట్‌లో కందిపప్పు ప్రియం..
 ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కందిపప్పు ధర రూ.72 పలుకుతోంది. ఈ లెక్కన క్వింటాల్ కందులకు రూ.5వేల నుంచి రూ.5,500 ధర పలకాలి. కానీ రైతులు కందులు అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. రైతులు కంది సాగుకు ఎకరానికి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు పెట్టుబడి పెట్టారు. పురుగు మందు, కూలీల ధరలు పెరిగిపోయాయి. ఇటు దిగుబడి రాక.. అటు మద్దతు ధర లేక రైతులు దిగులు చెందుతున్నారు. మార్కెట్‌లో మద్దతు ధర లభించేలా చూడాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

 పెట్టుబడే అధికం..
 క్వింటాలు కందులు నూర్పిడి చేస్తే మిల్లు ఖర్చు లు పోనూ 74 కిలోల వరకు కంది పప్పు, 22 కిలోల వరకు దాణా వస్తుంది. మిల్లు ఖర్చులు తదితర వాటిని తీసివేసి.. మార్కెట్‌యార్డులో వ్యాపారులు చెల్లిస్తున్న ధర రూ.3,800తో పో ల్చితే కందిపప్పు ధర కిలోకు రూ.60 దాట వద్దు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న కిరాణ దు కాణ పప్పు ధరతో పోలిస్తే రైతుకు రావాల్సిన మద్దతు ధర రూ.5వేల నుంచి రూ.5,500వరకు వ్యాపారులు చెల్లించాలి. దిగుబడిపై రాబడి తగ్గగా.. పెట్టుబడి పెరిగింది. పత్తిలో నష్టాలు చవిచూసిన రైతులు.. కందులు ఆదుకుంటాయని ఆశించగా నిరాశే ఎదురవుతోంది.

>
మరిన్ని వార్తలు