నాన్‌బీటీ సేంద్రియ పత్తికి పునరుజ్జీవం!

10 Oct, 2023 09:39 IST|Sakshi

తెలంగాణ, ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లో నాన్‌బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తికి స్వతంత్ర పరిశోధనా సంస్థల శ్రీకారం

వచ్చే ఖరీఫ్‌ నాటికి తెలుగు రాష్ట్రాల్లో 3 వేల ఎకరాలకు నాన్‌ బీటీ సేంద్రియ పత్తి విత్తనాల సరఫరా లక్ష్యం 

నాన్‌బీటీ సేంద్రియ పత్తికి పునరుజ్జీవం!మన దేశంలో పత్తి సాగులో వాడుతున్నది 95% వరకు జన్యుమార్పిడి చేసిన పత్తి విత్తనాలే. నాన్‌బీటీ దేశీ పత్తి రకాలు దాదాపు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఈ నేపథ్యంలో నాన్‌బీటీ దేశీ, అమెరికన్‌ పత్తి రకాలను తిరిగి రైతులకు అందించే కృషికి అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ స్వతంత్ర పరిశోధనా సంస్థలు శ్రీకారం చుట్టాయి. వచ్చే ఖరీఫ్‌ నుంచే తెలుగు రాష్ట్రాల్లో 3 వేల ఎకరాల్లో రైతులకు ఈ విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ పత్తి దినోత్సవం (అక్టోబర్‌ 7) సందర్భంగా ప్రత్యేక కథనం...

సేంద్రియ పత్తి సాగు వల్ల భూతాపం పెరుగుదలను దీటుగా ఎదుర్కోవటం, ఆరోగ్యదాయకమైన దూది ఉత్పత్తిని పెంపొదించటం వంటి ప్రయోజనాలెన్నో ఉన్నాయి. సేంద్రియ పత్తి విస్తీర్ణాన్ని పెంపొందించాలంటే మొదట జన్యుమార్పిడి చేయని (నాన్‌ బీటీ) దేశీ, హైబ్రిడ్‌ రకాల పత్తి విత్తనాలను తొలుత స్థానికంగా రైతులకు అందుబాటులోకి తేవాలి. ఈ అసరాన్ని గుర్తించిన అనేక అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ స్వతంత్ర పరిశోధనా సంస్థలు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనువైన నాన్‌ బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తి కార్యక్రమాలను ఈ సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి.

ఈ క్రమంలోనే మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లో నాన్‌ బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని నెదర్లాండ్స్‌కు చెందిన ఆర్గానిక్‌ కాటన్‌ యాక్సలరేటర్‌(ఒసిఎ), స్విట్జర్లాండ్‌కు చెందిన స్వతంత్ర సేంద్రియ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఎఫ్‌ఐబిఎల్‌) శ్రీకారం చుట్టాయి. ఈ సంస్థల తోడ్పాటుతో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్‌ఎ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాన్‌బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తికి ఈ ఖరీఫ్‌ నుంచి కృషి ప్రారంభించింది. 

30 నాన్‌ బీటీ పత్తి రకాల ప్రయోగాత్మక సాగు
మన దేశంలో నాన్‌ బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తికి సంబంధించి గత ఆరేళ్లుగా క్షేత్రస్థాయిలో వంగడాల ఎంపిక ప్రక్రియ స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్‌పిఓ)ల స్థాయిలో సాగుతోంది. ఈ క్రమంలో 30 నాన్‌ బీటీ రకాలు రైతులకు నచ్చే విధంగా ఫలితాలనిస్తున్నాయని గుర్తించారు. వీటిలో దేశీ పత్తి సూటి రకాలు, అమెరికన్‌ పత్తి సూటి రకాల తోపాటు అమెరికన్‌ హైబ్రిడ్‌ పత్తి రకాలు ఉన్నాయి. అయితే, ఈ 30 నాన్‌ బీటీ సూటి/హైబ్రిడ్‌ రకాల్లో ఏయే రకాలు ఏయే రాష్ట్రాల్లో ఉత్తమ ఫలితాలనిస్తున్నాయన్న క్షేత్ర స్థాయి అధ్యయనం ఈ ఖరీఫ్‌లో ప్రధానంగా పత్తి సాగయ్యే ఆరు రాష్ట్రాల్లో చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, మధ్యప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ప్రత్యేక జాగ్రత్తలతో సాగు చేస్తున్నారు. తెలంగాణలోని యాదాద్రి జిల్లా వెలమజాల గ్రామంలో నేలతల్లి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఒక ఎకరంలో 30 రకాల నాన్‌బీటీ పత్తి రకాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తోంది. అదేవిధంగా, ఏపీలో నూజివీడుకు సమీపంలోని కొండపర్వలో గల కృష్ణ సుధ అకాడమీ ఫర్‌ ఆగ్రోఎకాలజీ ఆవరణలో ఒక ఎకరంలో 30 నాన్‌ బీటీ పత్తి రకాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు.

జన్యు స్వచ్ఛత కోసం ఒక్కో రకానికి మధ్య జొన్న వరుసలు విత్తారు. ఈ రెండు క్షేత్రాలను సిఎస్‌ఎ శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు. ఈ 30 రకాల్లో ఏ రకాలు మెరుగైన ఫలితాలనిస్తాయో పరిశీలించి, వచ్చే సంవత్సరాల్లో ఆయా రకాలను విస్తృతంగా సాగులోకి తెచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించనున్నాయని సిఎస్‌ఎ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, సీనియర్‌ శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్‌ చెప్పారు. 

వచ్చే ఖరీఫ్‌ నాటికి 3 వేల ఎకరాలకు అందుబాటులోకి నాన్‌బీటీ పత్తి విత్తనాలు 
ఇదిలా ఉండగా, 5 రకాల నాన్‌బీటీ పత్తి రకాల విత్తనోత్పత్తి ఆరు రాష్ట్రాల్లో రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా ఈ ఖరీఫ్‌లో మొత్తం 25 ఎకరాల్లో ్ర΄ారంభమైంది. ఇందులో భాగంగా, తెలంగాణలోని రెండు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు 5 నాన్‌ బీటీ పత్తి రకాల విత్తనోత్పత్తిని 5 ఎకరాల్లో చేపట్టాయి. వీటిల్లో ఆర్‌విజెకె–ఎస్‌జిఎఫ్‌1 అనే దేశీ పత్తి (అర్బోరియం) సూటి రకం ఒకటి. ఆర్‌విజెకె–ఎస్‌జిఎఫ్‌2, ఎన్‌డిఎల్‌హెచ్, సురక్ష అనే 3 రకాల అమెరికన్‌  (హిర్సుటం) సూటి రకాలతో΄ాటు.. వసుధ గోల్డ్‌ అనే హైబ్రిడ్‌ పత్తి రకాలను ఒక్కో రకాన్ని ఒక్కో ఎకరంలో జోగులాంబ గద్వాల్‌ జిల్లా రాజోలిలోని రాజోలి ఎఫ్‌పిఓ, జనగామ జిల్లాలోని ఆరద్శ ఎనబావి ఎఫ్‌పిఓలు సాగు చేస్తున్నాయి. ఈ విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని సిఎస్‌ఎస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, సీనియర్‌ శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్‌ పర్యవేక్షిస్తున్నారు. 

రైతులకు నచ్చే లక్షణాల తోపాటు మేలైన దిగుబడినిచ్చే ఈ నాన్‌ బీటీ రకాల సామర్ధ్యాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించే లక్ష్యంతో పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నామని, వచ్చే ఖరీఫ్‌కు 3 వేల ఎకరాల్లో సాగుకు ఈ విత్తనాలు అందుబాటులోకి తెస్తామన్నారు.  వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో ఈ నాన్‌ బీటీ పత్తి రకాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే ఆసక్తి ఉన్న రైతులు ఈ విత్తన క్షేత్రాలను దసరా తర్వాత కాయ దశలో స్వయంగా సందర్శించి, విత్తనాలను బుక్‌ చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు తనను సంప్రదించాలని డా. రాజశేఖర్‌ (83329 45368) తెలిపారు.

– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

(చదవండి: పత్తి కేవలం వాణిజ్య పంటే కాదు ఆహార పంట కూడా..ఆఖరికి కొన్ని దేశాల్లో..)

మరిన్ని వార్తలు