మూకుమ్మడిగా బదిలీ వేటు!

25 Dec, 2014 03:01 IST|Sakshi

ఒకేసారి 18 మంది పంచాయతీ విస్తరణాధికారుల బదిలీ
16 మందికి ఈ నెల 20వ తేదీతో ఉత్తర్వులు
మరో ఇద్దరికి నవంబర్ 22వ తేదీతో ఉత్తర్వులు
పరిపాలనాపరమైన కారణాలని అధికారుల సాకు
ఒకేసారి ఇంతమందికా అని ఉద్యోగుల విస్మయం
 ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి ఫలితమేనని ఆరోపణలు

 
శ్రీకాకుళం: సాధారణ బదిలీలు జరిగి నెల రోజులైనా కాకముందే జిల్లా పంచాయతీ శాఖలో పరిపాలన అవసరాల ముసుగులో మరోమారు బదిలీలకు తెర తీశారు. ఆ సాకుతో 16 మందిపై బదిలీ వేటు వేయడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. ఈ నెల 20వ తేదీతో జారీ  ఉత్తర్వులతో జిల్లాలో 16 మంది పంచాయతీ విస్తరణాధికారులు బదిలీ కాగా, గత నెల అంటే నవంబర్ 22వ తేదీతో ఇప్పుడు జారీ చేసిన ఉత్తర్వులతో మరో ఇద్దరిని బదిలీ చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే హుద్‌హుద్ తుపాను కారణంగా పంచాయతీ విస్తరణాధికారులు బిజీ అయ్యారని, అందుకే అప్పట్లో బదిలీలు చేయలేదని సాకులు చెబుతున్నారు. వాస్తవానికి పరిపాలనా పరమైన కారణాలతో బదిలీ చేయాలంటే సదరు ఉద్యోగి ఇప్పటికే ఒకటి రెండు షోకాజ్ నోటీసులు వంటివి అందుకొని ఉండాలి.

విధులకు తరచూ డుమ్మాకొడుతున్నట్టు గానీ  అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు గానీ ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు బదిలీ అయిన ఉద్యోగులు నెల రోజుల వ్యవధిలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం లేదు. కానీ పరిపాలనా పరమైన కారణాల పేరుతోనే వారిని బదిలీ చేశారు. అది కూడా సుదూర ప్రాంతాలకు పంపించారు. ఈ బదిలీల వెనుక ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన అనుచరుల ఒత్తిడి మేరకు ఆ నాయకుడు జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఈ అకాల బదిలీలు జరిగాయని పలువురు బహిరంగంగానే చెబుతున్నారు. జలుమూరు పంచాయతీ విస్తరణాధికారిని సీతంపేటకు, ఎల్.ఎన్.పేట విస్తరణాధికారిని నందిగాంకు, సీతంపేట విస్తరణాధికారిని రేగిడికి, అక్కడి విస్తరణాధికారిని కవిటికి, కవిటి విస్తరణాధికారిని ఎల్.ఎన్.పేటకు, సంతబొమ్మాళి విస్తరణాధికారిని వీరఘట్టానికి, వంగర  విస్తరణాధికారిని పొందూరుకు, కంచిలి విస్తరణాధికారిని జలుమూరుకు బదిలీ చేసినట్లు తెలిసింది. వీరందరికీ ఈ నెల 20వ తేదీతో ఉత్తర్వులు ఇచ్చారు.

ఇక ఆమదాలవలస పంచాయతీ విస్తరణాధికారిని శ్రీకాకుళం రూరల్ మండలానికి, శ్రీకాకుళం రూరల్ మండల పంచాయతీ విస్తరణాధికారిని పాలకొండకు బదిలీ చేశారు. వీరిద్దరికీ మాత్రం గత నెల 22వ తేదీతో ఉత్తర్వులు రావడం గమనార్హం. దీనిపై జిల్లా పంచాయతీ అధికారిణి సెల్వియాను ఫోన్‌లో వివరణ కోరగా పరిపాలనా పరమైన బదిలీలు ఎప్పుడైనా చేయవచ్చన్నారు. ఇటువంటి బదిలీలకు ప్రభుత్వ ఆంక్షలు వర్తించవన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా