ఉరుకులు..పరుగులు

23 May, 2018 09:21 IST|Sakshi
వైద్య కళాశాలలో హెడ్‌ కౌంట్‌ చేస్తున్న ఎంసీఐ బృందం సభ్యులు., చిత్రంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు

ఎంసీఐ బృందం ఆకస్మిక తనిఖీ

సర్వజనాస్పత్రి, వైద్యకళాశాలలో పరిశీలన

రేడియాలజీ సేవలపై  తీవ్ర అసంతృప్తి

బీకేఎస్, ఆత్మకూరు పీహెచ్‌సీల తనిఖీ

అనంతపురం న్యూసిటీ: ప్రీ పీజీ సీట్ల మంజూరులో భాగంగా భారత వైద్య మండలి (ఎంసీఐ) బృందం మంగళవారం అనంతపురం సర్వజనాస్పత్రి – వైద్య కళాశాలతోపాటు బుక్కరాయసముద్రం, ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసింది. లోపాలు బయటపడకుండా చూసుకునేందుకు వైద్యులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఎంసీఐ బృందంలో అనాటమీ ప్రొఫెసర్‌ (గౌహతి), ఫోరెన్సిక్‌ ప్రొఫెసర్‌ (సూరత్‌), సర్జరీ ప్రొఫెసర్‌ (బెంగళూరు)  ఉన్నారు.  సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ ఉండగానే ఆయన సీటులో అనస్తీషియా హెచ్‌ఓడీ డాక్టర్‌ నవీన్‌ కుమార్‌ కూర్చుని ఉండటంతో వైద్యులు కంగుతిన్నారు.

అనంతరం ఎంసీఐ బృందం ఆస్పత్రిలోని మెడిసిన్, చిన్నపిల్లలు, గైనిక్, సైకియాట్రీ తదితర ఓపీలను పరిశీలించారు. ఓపీ, ఐపీ పేషెంట్లు, డిజిటల్‌ రికార్డుల గురించి ప్రశ్నించారు. ఓపీ 1800 నుంచి 2000 మంది, ఐపీ వెయ్యి మంది ఉన్నారని అధికారులు సమాధానమిచ్చారు. గైనిక్‌ విభాగంలో గర్భిణులకు అందుతున్న సేవల గురించి ఎంసీఐ బృందం సభ్యులు డాక్టర్‌ నాగరాజు ఆరా తీశారు. రోజూ 25 నుంచి 30 దాకా ప్రసవాలు జరుగుతున్నాయని హెచ్‌ఓడీ డాక్టర్‌ శంషాద్‌బేగం వివరించారు. మెయిన్‌ ఆపరేషన్‌ థియేటర్‌ను పరిశీలించి పరికరాలు, సిబ్బంది కొరతకు సంబంధించి సమాచారాన్ని ఇవ్వాలని బృందం సభ్యులు ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నవీన్, అకడమిక్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జేసీ రెడ్డి, సర్జరీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ రామస్వామి నాయక్‌ను కోరారు. 

43 రోజులుగా ఒక్క స్కాన్‌ చేయలేదా?  
సర్వజనాస్పత్రి రేడియాలజీ విభాగంలోని ఆల్ట్రాసౌండ్‌ స్కాన్‌ సెంటర్‌లోకి వెళ్లిన బృందం సభ్యులకు అక్కడ వైద్యులు కన్పించలేదు. రికార్డులను పరిశీలించగా గత నెల తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు ఒక్క స్కానింగ్‌ కూడా తీసినట్టు నమోదు కాలేదు. 43 రోజులుగా ఒక్కసానింగ్‌ కూడా చేయలేదా అని ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అందుబాటులో ఉన్న ఒక్క వైద్యురాలు కంపల్సరీ సెలవులో వెళ్లిందని డాక్టర్‌ జేసీ రెడ్డి తెలియజేశారు. స్కాన్‌లు ఏవిధంగా చేస్తున్నారని డాక్టర్‌ నాగరాజ్‌ ఆరా తీస్తే అన్నీ ప్రైవేట్‌గా చేయిస్తున్నామని సమాధానం ఇచ్చారు. రేడియాలజీ బోర్డులో 15 మంది వైద్యులుండాల్సిన చోట ముగ్గురు మాత్రమే ఉన్నారని ఆయన నోట్‌ చేసుకున్నారు. సీటీ స్కాన్‌ సెంటర్‌లో ఎన్ని స్కాన్‌లు చేశారని ఆరా తీశారు. అందుకు అక్కడి సిబ్బంది 37 చేశామని చెప్పగా, రికార్డులో 20 మాత్రమే నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అనంతరం వైద్య కళాశాలలోని వివిధ విభాగాలతో పాటు, మైక్రోబయాలజీ, పెథాలజీ, ఫార్మకాలజీ ల్యాచ్‌లు, ఈ సెంటర్, లైబ్రరీ తదితర వాటిని పరిశీలించారు.

వైద్య కళాశాలలో హెడ్‌కౌంట్‌
వైద్య కళాశాలలో మెడిసిన్, చిన్నపిల్లల విభాగం, ఆర్థో, సర్జరీ, గైనిక్, ఫోరెన్సిక్, ఆప్తమాలజీ, డర్మటాలజీ, అనస్తీషియా, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఈఎన్‌టీ, రేడియాలజీ, పెథాలజీ, ఎస్‌పీఎం, తదితర విభాగాలలో ఎంసీఐ బృందం హెడ్‌ కౌంట్‌ చేసింది. వైద్యుల ఆధార్‌తో పాటు వారి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను నిశితంగా పరిశీలించారు. ఎంసీఐ బృందం వెంట వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు, హెచ్‌ఓడీలు డాక్టర్‌ రామస్వామి నాయక్, డాక్టర్‌ పల్లా శ్రీనివాసులు, డాక్టర్‌ శంషాద్‌బేగం తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు