మేము ఓటేసేదెలా..?

3 Apr, 2019 18:24 IST|Sakshi

జిల్లాలోని వైద్య సిబ్బంది ఆవేదన

సాక్షి, దర్శి టౌన్‌: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ విధుల్లో అధికారులు, సిబ్బందిని నియమించే విషయంలో హడావిడిగా తీసుకుంటున్న నిర్ణయాలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా వైద్యారోగ్య సిబ్బందిని, డాక్టర్లను పోలింగ్‌ విధులకు కేటాయించినప్పటికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వకపోవడంతో ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల విధుల్లో ఉండటం వల్ల స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసే అవకాశం ఉండదని చెబుతున్నారు.


జిల్లాలో 14 సీహెచ్‌సీలు, 90 పీహెచ్‌సీలు ఉన్నాయి. వాటిలో పనిచేస్తున్న దాదాపు 2,973 మంది ఆశా కార్యకర్తలు, ఎంపీహెచ్‌ఈఓలు, హెచ్‌ఎస్‌లు, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందిని మార్చి 26న పోలింగ్‌ విధులకు నియమించారు. వీరందరికీ పోస్టల్‌ బ్యాలెట్లు కేటాయించారు. అయితే, మరో 309 మంది ఆరోగ్య కార్యకర్తలు, హెచ్‌ఈఓలు, హెచ్‌ఎస్‌లను రెండు రోజుల క్రితం (గత నెల 31వ తేదీ) పోలింగ్‌ బూత్‌లలో విధులకు నియమించారు. ఏప్రిల్‌ 1వ తేదీ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మరో 1,500 మంది ఆరోగ్య సిబ్బందిని, 150 మంది వైద్యాధికారులను పోలింగ్‌ బూత్‌ల వద్ద అత్యవసర సేవలు అందించడానికి నియమించారు.

ఆయా పీహెచ్‌సీల పరిధిలోని పోలింగ్‌ బూత్‌ల వద్ద డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఆరోగ్య సిబ్బంది, సూపర్‌వైజర్లు విధులు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కానీ, వీరెవరికీ పోస్టల్‌ బ్యాలెట్లు కేటాయించలేదు. దీంతో మొత్తం 1959 మంది డాక్టర్లు, సిబ్బంది తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవా లంటూ ఆందోళన చెందుతున్నారు.


స్వస్థలాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న వారికి ఇబ్బందే...
వైద్యాధికారులు, సిబ్బంది ఎక్కడెక్కడో పనిచేస్తుండగా, వారిలో పనిచేసే ప్రాంతంలో కాకుండా ఎక్కడెక్కడో స్వస్థలాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న వారికి పోలింగ్‌ విధుల కారణంగా ఓటేయడం ఇబ్బందిగా మారే పరిస్థితి నెలకొంది. వైద్యాధికారులు, సిబ్బందిలో ఎక్కువ మంది పనిచేసే ప్రాంతాల్లో నివాసం ఉండటం లేదు. సమీపంలోని పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటూ పనిచేసే ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి వారంతా ఉదయాన్నే వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో, స్వస్థలాల్లో ఓటు హక్కును వినియోగించుకుని అనంతరం పోలింగ్‌ విధులకు హాజరుకావాలి. అలా చేయాలంటే సమయానికి పోలింగ్‌ విధులకు హాజరవడం జరగని పని. పోలింగ్‌ విధులకు సకాలంలో హాజరు కావాలంటే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ విధులకు నియమించిన వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు.


ఓటు వేసి వెంటనే విధులకు హాజరుకావాలి 
పోలింగ్‌ విధులకు నియమించడి పోస్టల్‌ బ్యాలెట్లు కేటాయించని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది అందరూ తొలుత వారి ఓటు వేసి ఆ వెంటనే పోలింగ్‌ బూత్‌ల వద్ద విధులకు హాజరుకావాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ రాజ్యలక్ష్మి తెలిపారు. దూరప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించగా, పోలింగ్‌ విధులకు మాత్రం కచ్చితంగా అందరూ హాజరుకావాల్సిందేని స్పష్టం చేశారు.
- డీఎంఅండ్‌హెచ్‌ఓ                                                  
  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?