మరణ ప్రయాణం

15 Dec, 2013 04:35 IST|Sakshi
బెండపూడి(తొండంగి), న్యూస్‌లైన్ :పెళ్లి పనుల్లో అక్కరకొస్తుందనుకున్న మోటార్ బైక్ మృత్యు వాహనంగా మారింది. వద్దన్నా వినకుండా బావ మరిది పెళ్లికి బైక్‌ను తీసుకెళ్లిన వ్యక్తి.. అదే బైక్‌పై తిరిగొస్తూ ప్రమాదానికి గురయ్యాడు. బస్సును క్రాస్ చేస్తుండగా.. అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గార్డ్ పోస్టు(స్తంభాలు)లను ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. జాతీయ రహదారిపై బెండ పూడి శివారు తమ్మయ్యపేట వద్ద శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.సామర్లకోట మఠం సెంటర్‌కు చెందిన జామి నరసింహారావు(40) ఆదిత్య మెడికల్స్‌ను నిర్వహిస్తున్నాడు. 
 
 అతడి బావమరిది ఏఎస్ రావు పెళ్లి విశాఖపట్నంలో ఏర్పాటు చేయడంతో కొద్ది రోజుల క్రితం నరసింహారావు తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లాడు. బావమరిది పెళ్లిలో సాయంగా ఉంటుందని తన మోటార్ బైక్‌ను తీసుకెళ్లాడు. వివాహ వేడుకలు ముగిశాక శనివారం ఉదయం విశాఖపట్నం నుంచి మోటార్ బైక్‌పై సామర్లకోటకు తిరుగు పయనమయ్యాడు.  పెళ్లి సందర్భంగా ఆడపడుచుకు ఇచ్చిన బియ్యం మూటను తీసుకుని అతడు బయలుదేరాడు. ఇతర బంధువులతో కలిసి అతడి భార్య రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు బయలుదేరింది. ఇలాఉండగా జాతీయ రహదారిలోని బెండపూడి శివారు తమ్మయ్యపేట దాటాక బస్సును బైక్‌తో క్రాస్ చేస్తూ నరసింహారావు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గార్డ్ పోస్ట్‌లను ఢీకొన్నాడు. 
 
 ఈ ప్రమాదంలో నరసింహారావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు ఈ విషయాన్ని నరసింహారావు సెల్‌ఫోన్ ద్వారా అతడి బంధువులకు తెలిపారు. విశాఖపట్నం నుంచి రైలులో అత్తవారింటికి వెళ్తున్న ఏఎస్ రావుకు ఈ విషయం తెలిసింది. అప్పటికే రైలు అన్నవరం చేరుకోవడంతో.. ఏఎస్ రావు రైలు దిగి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. దగ్గరుండి తన పెళ్లిని సందడిగా జరిపించిన బావ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని ఏఎస్ రావు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. బంధువులకు అతడు సమాచారం అందించడంతో వారంతా అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
 
 వద్దన్నా వినలేదు
 ‘బావా.. బైక్‌ను పార్శిల్‌లో పంపుదాం, రైలులో మావెంట వచ్చేయ్’ అని చెప్పినా వినకుండా నరసింహారావు బైక్‌పై బయలుదేరాడని ఏఎస్ రావు సంఘటన స్థలంలో భోరున విలపించాడు. నరసింహారావుకు భార్య పద్మ, కుమార్తెలు అనూష, శ్రీవర్ష ఉన్నారు. సామర్లకోట మఠం సెంటర్‌లో మెడికల్ షాపు నిర్వహిస్తూనే, ఆయిల్ వ్యాపారం కూడా చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. తొండంగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 
మరిన్ని వార్తలు