వైఎస్‌ జగన్‌ షర్టును 23న కోర్టుకు సమర్పించండి

18 Nov, 2018 05:00 IST|Sakshi

‘సిట్‌’కు విశాఖ 7వ అదనపు మెట్రోపాలిటన్‌ కోర్టు ఆదేశాలు

విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్టోబర్‌ 25వ తేదీన విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన సమయంలో ఆయన ధరించిన చొక్కాను తమకు సమర్పించాలని విశాఖ 7వ అదనపు మెట్రోపాలిటన్‌ కోర్టు ‘సిట్‌’ అధికారులను ఆదేశించింది. ఈ కేసును సిట్‌ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు కత్తి గాయం కారణంగా చిరిగిన ఆయన చొక్కాకు రక్తం మరకలు అయ్యాయి. దీంతో వైఎస్‌ జగన్‌ ఆ చొక్కాను వీఐపీ లాంజ్‌లోనే మార్చుకుని మరో షర్టు ధరించి విమానంలో హైదరాబాద్‌ వెళ్లి చికిత్స కోసం నేరుగా ఆసుపత్రికి చేరుకున్న సంగతి తెలిసిందే.

ఘటన సమయంలో వైఎస్‌ జగన్‌ ధరించిన షర్టును అందచేయాలన్న ఉత్తర్వులపై సిట్‌ అధికారిగా వ్యవహరిస్తున్న విశాఖ ఏసీపీ బీవీఎస్‌ నాగేశ్వరరావును ‘సాక్షి’ శనివారం రాత్రి వివరణ కోరగా ఆ చొక్కాను ఈ నెల 23న కోర్టుకు సమర్పించాలని ఆదేశించిందన్నారు. అయితే ఈ విషయంలో వైఎస్‌ జగన్, ఆయన పీఏ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరంలేదని, ఆ చొక్కాను ఎవరైనా తీసుకొచ్చి అప్పగించవచ్చని చెప్పారు. 

మరిన్ని వార్తలు