గుడ్డుకు సెలవు

5 Dec, 2018 12:07 IST|Sakshi
గుడ్డు లేకుండా భోజనం చేస్తున్న అంగన్‌వాడీ చిన్నారులు

20 రోజులనుంచి అంగన్‌వాడీలకు నిలిచిన సరఫరా

కొత్త టెండర్లతో నిలిచిన పంపిణీ ప్రక్రియ

లబ్ధిదారులకు అందని పౌష్టికాహారం

అంగన్‌వాడీ కేంద్రాలకు 20 రోజులకు పైగా కోడిగుడ్లు సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం జిల్లాలవారీగా సరఫరా చేసే కాంట్రాక్టర్లను నియమించాలనే ఉద్దేశంతో గత నెల్లో అంతకుముందు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌ను ఆపివేసి కొత్త టెండర్లు నిర్వహించింది. ఈ సందర్భంగా మూడు టెండర్లు దాఖలుకాగా మార్కెట్‌ ధరకంటే అధిక ధరకు కోట్‌ కావడంతో టెండర్ల ఖరారును జిల్లా అధికారుల ఆపివేశారు. దీంతో గుడ్డు సరఫరా జిల్లావ్యాప్తంగా ఆగిపోవడంతో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు సక్రమమైన పౌష్టికాహారం అందడం లేదు.

నెల్లూరు, ఉదయగిరి: జిల్లాలో 3,774 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 17 ప్రాజెక్ట్‌ల పరిధిలో ఉండే అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రతిరోజూ 1.70 లక్షల గుడ్లు సరఫరా చేయాలి. 20 రోజులనుంచి పంపిణీ పూర్తిగా ఆగిపోయింది. ప్రస్తుతం కోడిగుడ్లు రూ.4.63కు కాంట్రాక్టరు సరఫరా చేస్తుండగా కొత్త టెండర్లలో రూ.5.46కు టెండరు వేయడంతో అధికారులు నిలిపివేశారు. దీనిపై తుది నిర్ణయం కమిషనర్‌కు జిల్లా అధికారులు వదిలివేయడంతో ఈ ప్రక్రియ ఆలస్యమౌతోంది.

ఆగిన పోషకాహారం
అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు వారానికి ఆరురోజులు గుడ్లు పంపిణీ చేస్తారు. ప్రీస్కూలు పిల్లలకు వారానికి నాలుగు గుడ్లు ఇస్తారు. ఆర్నెల్లనుంచి మూడేళ్లలోపు పిల్లలకు వారానికి రెండు గుడ్లు ఇస్తారు. ప్రస్తుతం సరఫరా నిలిపివేయడంతో వీరెవరికీ గుడ్లు అందడం లేదు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ప్రీస్కూలు పిల్లలు, గర్భిణులు, బాలింతల సంఖ్య కూడా తగ్గిపోతుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు
గత 20 రోజులనుంచి గుడ్లు సరఫరా పూర్తిగా నిలిచిపోయినా సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేయలేదు. టెండర్ల దాఖలాలో ఏర్పడిన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సంబంధిత కమిషనరు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో సరఫరా ఆలస్యం జరుగుతోంది. గత కొన్నేళ్లనుంచి గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టరుకే మళ్లీ అధిక ధరకు టెండరు దక్కేవిధంగా ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపణలున్నాయి. అధిక ధరకు టెండరు ఇప్పించి అందులో కొంతమొత్తంలో కమీషన్‌ కొట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని యూనియన్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. పైగా అంగన్‌వాడీ కేంద్రాల కాంట్రాక్ట్‌ దక్కించుకున్న వ్యక్తే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి కూడా గుడ్లు సరఫరా అప్పగించే అవకాశముంది. దీంతో ఏడాదిలో కోట్ల రూపాయలు లబ్ధిపొందే పరిస్థితి నెలకొంది. ఎలాగైనా తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌కు ఈ టెండరు దక్కేవిధంగా జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ నేత ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు