ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ డే: ఎన్ని టన్నుల ఆహారం వృథా అవుతోందో తెలుసా?

16 Oct, 2023 13:09 IST|Sakshi

World Food Day 2023: ప్రపంచ ఆహార దినోత్సవం 2023: సరైన ఆహారం , పోషకాహారాన్ని పొందడం మానవ ప్రాథమిక హక్కు. ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజలు సరైన పోషకాహారంలేక, పరిశుభ్రమైననీరు అందుబాటులో లేక నానా  కష్టాలుపడుతున్నారు.మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టన్నుల  కొద్దీ ఆహారం వృధా అవుతోంది. ప్రపంచ  ఆహార దినోత్సవం  సందర్భంగా ఈ భూమ్మీద ప్రతి వ్యక్తికి సరైన పోషకాహారం, సరైన ఆహారం లభించేలా అవగాహన పెంచడం, సంబంధిత చర్యలు తీసుకోవడంపై ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా  కొన్ని ఇంట్రస్టింగ్‌ సంగతులు మీకోసం..

1979లో, FAO సమావేశంలో, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అధికారికంగా ప్రపంచ సెలవుదినంగా ఆమోదించారు. ఆ తర్వాత, 150 కంటే ఎక్కువ దేశాలు ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాధాన్యతను గుర్తించాయి.  2023 వరల్డ్‌ ఫుడ్‌ డే ధీమ్‌ ఏంటంటే  ‘‘నీరే జీవితం, నీరే ఆహారం... ప్రతీ ఒక్కరికీ ఇది అందుబాటులో ఉండాలి’’ భూమిపై జీవించడానికి నీరు చాలా అవసరం. ఈ భూమిపై ఎక్కువ భాగం, మన శరీరాల్లో 50శాతం పైగా నీరే ఉంటుంది. అసలు ఈ  ప్రపంచం ముందుకు సాగాలంటే నీరు లేకుండా  సాధ్య పడుతుందా?  అలాంటి అద్భుతమైన ఈ జీవజలాన్ని కాపాడుకోవడం  చాలా అవసరం.  ప్రపంచ జనాభాలో ఎంతమందికి  కడుపునిండా భోజనం దొరుకుతోంది? అసలు ఎంత ఆహారం  వృథా అవుతోంది మీకు తెలుసా?

మీకు తెలుసా...
ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా అక్టోబరు 16వ తేదీని ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ డేను ఆచరిస్తున్నాం.
ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. ప్రపంచ జనాభా 810 కోట్లు కాగా... ఇందులో 300 కోట్ల మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత కూడా లేదు.
ఇజ్రాయెల్‌ - పాలస్తీనా, రష్యా-ఉక్రెయిన్‌ల మాదిరిగా యుద్ధాలు, వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత తగ్గిపోతోంది.
అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఏటా 130 కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెరిగితే అన్నార్తులు మరింత మంది ఆకలి తీర్చే అవకాశం ఏర్పడుతుంది.
కోవిడ్‌-19 పుణ్యమా అని పేదల ఆర్థిక స్తోమత మరింత దిగజారిపోయింది. ఫలితంగా చాలామందికి ప్రతి రోజూ నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లడమే కష్టమవుతోంది. 

ఆకలి మనిషి శరీరాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. పోషకాహార లోపం వాటిల్లో ఒకటి మాత్రమే. భారతదేశంలో పోషకాహార లోపాల కారణంగా ఐదేళ్ల లోపు పిల్లల్లో 30 శాతం మంది వారి సామర్థ్యానికి తగ్గట్టు ఎదగలేకపోతున్నారు.
ఆకలి మన రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకూ కారణమవుతుంది. రక్తహీనత, విటమిన్‌ లోపాలు వాటిల్లో కొన్ని మాత్రమే.
మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు కూడా ఆకలి కారణమవుతుందంటే చాలామంది ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం. మనోవ్యాకులత (డిప్రెషన్‌) యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు ఆకలి కారణంగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతారు.

ఇవీ చదవండిప్రకృతి ప్రకోపానికి మూల్యం... 12,300 కోట్ల డాలర్లు
ఆకలి సూచీలో అధోగతి

మరిన్ని వార్తలు