మహారాష్ట్రకు వలస కార్మికులు తరలింపు

5 May, 2020 20:52 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏపీలో చిక్కుకున్న మహారాష్ట్రలోని గచ్చిరొలి జిల్లాకు చెందిన 1,004 వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు మంగళవారం ఆనందంగా పయనమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వలస కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. గత నాలుగు నెలల క్రితం మహారాష్ట్ర నుంచి మిర్చికోత పనులకు 3,479 మంది కార్మికులు వచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా తిరిగి వారు తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గంపలగూడెం మండలం ఊటుకూరు, పెనుగులను దుందిరాలపాడు, తునికిపాడు లో ఉన్న వలస కార్మికుల తరలింపునకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నూజీవీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు.

మొదటి విడతగా నిన్న 1200 మంది వలస కార్మికులను 48 బస్సుల ద్వారా విజయవాడకు తరలించి అక్కడ నుంచి ప్రత్యేక రైలు ద్వారా మహారాష్ట్రకు తరలించారు. ప్రతి బస్సులో 25 మంది చొప్పున సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. వలస కార్మికులకు వైద్యులు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించిన తర్వాత ప్రయాణానికి అనుమతించారు. వలస కార్మికులకు మాస్కులు,స్నాక్స్ లను అందించి క్షేమంగా వారు తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

గుంతకల్లుకు చేరనున్న శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌..
అనంతపురం: లాక్‌డౌన్‌ కారణంగా ముంబైలో చిక్కుకున్న వలస కార్మికులు ఏపీకి రానున్నారు. రేపు తెల్లవారుజామున 5 గంటలకు ముంబై నుంచి గుంతకల్‌కు ప్రత్యేక రైలు శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌ చేరుకోనుంది. గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకునే 1150 మంది వలసకూలీలందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తామని.. అనంతరం క్వారంటైన్‌కు తరలిస్తామని కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు.జిల్లాలో 7000 క్వారంటైన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు.
 

మరిన్ని వార్తలు