‘గత ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితుల జీవితాలతో ఆడుకుంది’

7 Nov, 2019 14:58 IST|Sakshi

సాక్షి, కడప : వైఎస్సార్‌ జిల్లాలోని అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకొనేందుకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితులందరు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారన్న నమ్మకంతో ఓట్లేశారని, అందుకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన మొదటి బడ్జెట్‌లోనే బాధితులకు కేటాయింపులు చేశారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితుల జీవితాలతో ఆడుకుందని, ఉపశమన కమిటీ పేరుతో కాలాయాపన చేసిందని మంత్రి తెలిపారు. తాను కూడా బాధితుల తరుపున పొరాడానని, డబ్బులు అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సృష్టి టీడీపీ కుట్ర అని, ఆస్తులు ఉన్నా.. వాటిని కొట్టేసే ఉద్దేశంతోనే చంద్రబాబు బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్‌ విశ్వసనీయత ఉన్న నాయకుడని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని, బాధితుల కుటుంబాలలో సీఎం సంతోషాన్ని నింపుతారని పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమం సీఎం వైఎస్‌ జగన్‌కు రెండు కళ్లు అని, రానున్న రోజుల్లో మరిన్ని కొత్త పథ​కాలను చూస్తారని మంత్రి వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు